పిల్లలకు ఎక్కువగా యాంటీ బయాటిక్స్‌ ఇస్తున్నారా?- అయితే ఈ ముప్పు తప్పదు!

Asthma Risk Factors In Children : చిన్న పిల్లలకు ఆరోగ్య సమస్యలు వస్తే తల్లిదండ్రులు అల్లాడిపోతారు. వారి ఆరోగ్యం కుదుట పడటాననికి డాక్టర్లు సూచించే యాంటీ బయాటిక్స్‌ మందులు వాడుతుంటారు. అయితే, అలా తరచూ యాంటీ బయాటిక్స్‌ వాడటం వల్ల పిల్లల్లో ఆస్తమా సమస్యలు వచ్చే ఆవకాశాలు ఉన్నయాని తాజా పరిశోధనల్లో తెలింది. ఆ పరిశోధన వివరాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

యాంటీ బయాటిక్స్‌ ఎఫెక్ట్స్ : ఐదేళ్లలోపు పిల్లల్లో వచ్చే ఇన్‌ఫెక్షన్లకు 90% కారణం వైరస్‌లే అని డాక్టర్ ఉషారాణి తెలిపారు. వీటి కారణంగా మొదటి రెండు, మూడు రోజులు జ్వరం ఎక్కువగా ఉండి, నాలుగైదు రోజులకు దానంతటదే తగ్గిపోతుందని వెల్లడించారు. కాకపోతే కొందరు తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతారని, అవగాహన లేని కొందరు వైద్యులు కూడా చిన్నారులకు యాంటీ బయాటిక్స్‌ను సూచిస్తుంటారని ఆమె పేర్కొన్నారు. ఇలా వాడితే వాటికి నిరోధకత ఏర్పడటం ద్వారా పిల్లలకు భవిష్యత్‌లో నిజంగా అవసరమైన సమయంలో యాంటీ బయాటిక్స్‌ పనిచేయవన్నారు. ఈ కారణంగానే ఒకప్పుడు టైఫాయిడ్‌కు బాగా పనిచేసిన సిప్రోఫ్లోక్సాసిన్‌ మందు ఇప్పుడు ప్రభావం చూపడం లేదని తెలిపారు.

12 ఏళ్లలోపు పిల్లల్లో 7.9% ముప్పు : పిల్లలకు చిన్న వయసులోనే పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఈ కీలక దశలో తల్లిపాలు పట్టడంతోపాటుగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిచాల్సి ఉంటుంది. తద్వారా పిల్లల ఎదుగుదలకు, రోగ నిరోధకశక్తి చక్కగా పనిచేయడానికి ఈ బ్యాక్టీరియా తొడ్పడుతుంది. అయితే, యాంటీబయాటిక్స్‌ అధికంగా వాడితే పేగుల్లోని మంచి బ్యాక్టీరియకు కూడా నష్టం జరుగుతుంది. రోగ నిరోధక శక్తిపై ప్రభావం పడుతుంది. ఫలితంగా ఆస్తమా ముప్పు పెరుగుతుందని తెలుస్తోంది. ఒక అధ్యయనం ప్రకారం… ఇండియాలో 12 ఏళ్లలోపు పిల్లల్లోని 7.9% మందిలో ఆస్తమా కనిపిస్తోందని వెల్లడైంది. పిల్లలు, పెద్దలు కలుపుకొని.. ప్రపంచవ్యాప్తంగా ఆస్తమా కారణంగా సంభవించే మరణాల్లో సుమారు 46% భారత్‌ నుంచే నమోదవుతున్నట్లు నివేదికలు తెలియజేస్తున్నాయి. NLM కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. (National Librabry of Medicine రిపోర్ట్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి).

పిల్లికూతలు-డొక్కల ఎగరవేత : ఆస్తమా ముందుగా దగ్గుతో వస్తుంది. పిల్లి కూతలు కనిపిస్తుంటాయి. పిల్లలు డొక్కలు ఎగరేస్తారు. ఆయాసం పెరుగుతుంటుంది. ఆహారం తీసుకోరు. పిల్లలు అదేపనిగా ఏడుస్తుంటారు. ఉబ్బసం పెరిగితే ఆక్సిజన్‌ అందక.. జీవన్మరణ సమస్య కూడా ఎదురవుతుందని డాక్టర్ ఉషారాణి తెలిపారు.

తల్లి పాలే అత్యంత సురక్షితం : శిశువు పుట్టిన తొలి ఆర్నెల్లపాటు తల్లి పాలు మాత్రమే ఇవ్వాలని డాక్టర్ ఉషారాణి సూచిస్తున్నారు. ఆ తర్వాత రెండేళ్ల వరకు ఇతర ఆహారంతోపాటు తల్లి పాలను ఇస్తే ఆస్తమా బారినపడకుండా రక్షణ లభిస్తుందని ఆమె తెలిపారు. సీసా పాలతో పెరిగిన పిల్లలు, తక్కువ బరువుతో, నెలలు నిండకముందే పుట్టిన వారు, సిజేరియన్‌తో జన్మించిన పిల్లలకు ఉబ్బసం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నట్లు పలు పరిశోధనల్లో తెలిలింది. అందుకే వైద్యులు యాంటిబయాటిక్స్‌ రాస్తే వాటి వాడకంపై పిల్లల తల్లిదండ్రులు తప్పనిసరిగా ప్రశ్నించాలని ఆమె సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *