జస్ట్ మిస్…
- ఏపీ సీఎంకు ముద్దు పెట్టబోయిన మహిళ..
- అనకాపల్లి టూర్‌లో ఊహించని సన్నివేశం
పీపుల్స్‌డైరీ`అనకాపల్లి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి ఓ మహిళ ఊహించని షాక్ ఇచ్చింది. బాబును కలిసిన ఆనందంలో ఏకంగా ఆయనకు ముద్దు పెట్టేందుకు ప్రయత్నించింది. ఊహించని హఠత్పరిణామంతో చంద్రబాబు ఒక్కసారిగా ఆశ్చర్యపోగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో ఆమె తన ప్రయత్నాన్ని విరమించింది. తమ అభిమాన నాయకులు, నటులను కళ్లారా చూస్తే చాలని కొందరనుకుంటే.. వాళ్లను ఒక్కసారైనా తాకాలి.. హత్తుకోవాలి.. వారితో కలిసి ఓ ఫొటో తీసుకోవాలి.. రెండు మాటలైనా మాట్లాడాలి.. అని కొందరు ఫ్యాన్స్ తహతహలాడిపోతుంటారు. తీరా వాళ్లు ముందుకొచ్చి నిలబడితే.. ఆ తట్టుకోలేని ఆనందంలో ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా వింత వింతగా ప్రవర్తిస్తుంటారు. అచ్చంగా అలాంటిదే జరిగింది ఏపీలోని అనకాపల్లిలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటనలో ఓ మహిళా అభిమాని ఆయనను కలిసింది. ఆయనతో ఫొటో తీసుకుంది. అంతటితో ఆగకుండా.. ఏకంగా సీఎం చంద్రబాబుకు ముద్దు పెట్టేసింది. సీఎం చంద్రబాబుకు ఉన్న భద్రతా కారణాల వల్ల ఆయన చుట్టూ ఎప్పుడూ జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంటుంది. దీంతో.. చాలా తక్కువ మందికే ఆయనను కలిసేందుకు.. ఫొటో తీసుకునేందుకు ఛాన్స్ వస్తుంటుంది. అలా.. శనివారం సాయంత్రం అనకాపల్లి జిల్లాలో పర్యటించిన సీఎం చంద్రబాబును కలిసే అవకాశం దక్కించుకుంది ఓ మహిళ అభిమాని. పర్యటనలో భాగంగా.. చంద్రబాబును చూసేందుకు చాలా మంది టీడీపీ కార్యకర్తలు, ఆయన అభిమానులు వచ్చారు. ఆయనకు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఈ క్రమంలోనే.. ఓ మహిళా అభిమాని బాబును కలిసేందుకు తెగ ప్రయత్నించింది. చంద్రబాబును కలిసేందుకు చుట్టూ ఉన్న భద్రతా వలయాన్ని తప్పించుకుని ఆయన దగ్గరికి దూసుకొచ్చింది. ఆమె అభిమానాన్ని చూసి చంద్రబాబు కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. భద్రతా సిబ్బంది మహిళను వారించే ప్రయత్నం చేసినా.. చంద్రబాబు మాత్రం ఆ మహిళను దగ్గరకు తీసుకుని.. అప్యాయంగా పలకరించారు. దీంతో.. తన వెంట తీసుకొచ్చిన పుష్ఫగుచ్చాన్ని అందించింది. అది తీసుకున్న బాబు.. ఆమెతో ఫొటో తీసుకున్నారు. తన అభిమాన నాయకుడిని కలిసే అవకాశం రావటం.. అందులోని ఆయన తన భుజం మీద చెయ్యేసి ఫొటో తీసుకోవటం చూసి.. ఆ అభిమానికి ఆనందం ఉప్పొంగింది. ఒక్కసారైనా తన అభిమాన నాయకుని చేతిని తాకాలని.. ఆయన దృష్టిలో పడాలని తపించిన ఆమెను.. స్వయంగా ఆయనే ఆప్యాయంగా పలకరించటం, దగ్గరికి తీసుకోవటంతో.. సంతోషంతో ఉబ్బితబ్బిబ్బైపోయింది. ఆ పట్టరాని ఆనందంతో ఆయనకు ఏకంగా ముద్దు పెట్టేందుకు ప్రయత్నించింది. అప్పటికే.. ఆమెను ఎప్పుడు పక్కకు తోసెయ్యాలా అని చూస్తున్న భద్రతా సిబ్బంది.. ఆమె ముద్దు పెట్టేందుకు చేసిన ప్రయత్నాన్ని గమనించి.. వెంటనే అడ్డుకున్నారు. చంద్రబాబు కూడా ఆమె చేసిన ప్రయత్నాన్ని చూసి ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. చిన్న నవ్వు నవ్వి.. అలాంటి చేయొద్దన్నట్టుగా సైగ చేశారు. దానికి ఆమె.. ఆయన తన అన్న అని.. ఆయనంటే తానకు ఎంతో ఇష్టమని వివరిస్తూ.. మరోసారి హత్తుకుంది. అప్పటికే భద్రతా సిబ్బంది ఆమెను అక్కడి నుంచి పక్కను తీసుకెళ్లారు. అయితే.. ఈ సన్నివేశమంతా.. అక్కడే ఉన్న మీడియా కెమెరాల్లో రికార్డవటమే కాదు.. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యింది.
అయితే.. ఆమె ముద్దు పెట్టేందుకు ప్రయత్నించటంలో ఎలాంటి దురాభిప్రాయం లేదని.. తన అభిమాన నేతపై తనకున్న ప్రేమను, అభిమానాన్ని చూపించే ప్రయత్నమేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.