కాజీపేటలో వందేభారత్‌ కోచ్‌ ఫ్యాక్టరీ!

  • నెరవేరబోతున్న దశాబ్దాల కల
  • వచ్చే ఏడాది మార్చి నుంచి ఉత్పత్తి ప్రారంభమయ్యే ఛాన్స్‌
  • అత్యాధునిక రోబోటిక్‌ టెక్నాలజీ వినియోగం

పీపుల్స్‌డైరీ-వరంగల్‌ : తెలంగాణ వాసులు.. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్‌ ప్రాంతం శాబ్దాలుగా ఎదురుచూస్తున్న కల నెరవేరబోతోంది. వందే భారత్‌ మేడ్‌ ఇన్‌ తెలంగాణ అని సగర్వంగా చెప్పుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. కాజీపేటలోని కోచ్‌ ఫ్యాక్టరీకి ఏర్పాటుకు అడుగులు పడుతున్న క్రమంలో ఈ శుభవార్త ప్రతి ఒక్కరిని సంతోషానికి గురిచేస్తుంది. భారతీయ రైల్వేలో త్వరలోనే తెలంగాణ పేరు అందరికీ తెలియబోతోంది. రైలు కోచ్‌ మేడ్‌ ఇన్‌ తెలంగాణ అన్న అక్షరాలు కనిపించబోతున్నాయి. వరంగల్‌ జిల్లా వాసుల దశాబ్దాల కల అయిన కాజీపేట రైలు కోచ్‌ ఫ్యాక్టరీ మరికొన్ని నెలల్లో కార్యరూపం దాల్చబోతున్న క్రమంలో దేశవ్యాప్తంగా దూసుకుపోయే వందే భారత్‌ రైళ్లకు కాజీపేట నుండి హై స్పీడ్‌ బోగీలు సరఫరా కాబోతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వందే భారత్‌ రైళ్లకు ఉన్న డిమాండ్‌ అంతా ఇంతా కాదు. కేంద్రం కూడా వందే భారత్‌ రైళ్ల సంఖ్యను పెంచడానికి మరింత దృష్టి సారించింది. సాధారణ రైళ్ల స్థానంలో వందే భారత్‌ రైళ్లను ప్రారంభించాలని భావిస్తున్న క్రమంలో కాజీపేట ఫ్యాక్టరీ కేంద్రంగా వందే భారత్‌ రైళ్లకు కావలసిన కోచ్‌ లు తయారు చేయాలని నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది మార్చి నుంచి ఉత్పత్తిని ప్రారంభించే లక్ష్యంతో ముందుకు వెళుతుంది. అత్యాధునిక రోబోటిక్‌ టెక్నాలజీతో కాజీపేట లో ఏర్పాటు చేస్తున్న కోచ్‌ ఫ్యాక్టరీలో రైలు కోచ్‌ లను తయారు చేయాలని భావిస్తోంది. దీనికోసం జపాన్‌ కి చెందిన టైకిష ఇంజనీరింగ్‌ సంస్థ నుంచి ఆధునిక రోబోటిక్‌ యంత్రాలను దిగుమతి చేసుకుంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *