సైబర్‌ నేరగాళ్లొస్తున్నారు జాగ్రత్త

కుటుంబ సర్వే పేరుతో లూటీ

పీపుల్స్‌డైరీ`హైదరాబాద్‌ : తెలంగాణ వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే జరుగుతున్న సంగతి తెలిసిందే. రిజర్వేషన్ల ఖరారు, ప్రజల ఆర్థిక స్థితిగతులు తెలుసుకునేందుకు ఈ సర్వే నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం నియమించిన ఎన్యుమరేటర్లు ఇంటింటికి వెళ్లి కుంటుంబంలోని సభ్యుల వివరాలు నమోదు చేస్తున్నారు. అయితే ఇదే అదనుగా కొందరు సైబర్‌ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు తెర తీశారు. ఫేక్‌ ఐడీలు క్రియేట్‌ చేసుకొని సమగ్ర కుటుంబ సర్వే పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. ముగ్గురు లేదా నలుగురు టీంలుగా ఏర్పడుతున్న సైబర్‌ కేటుగాళ్లు అమాయకుల ఇళ్లకు వెళ్తున్నారు. తాము ప్రభుత్వం నియమించిన ఎన్యుమరేటర్లమని వారికి వారు పరిచయం చేసుకుంటున్నారు. జనాభా లెక్కల కోసం వచ్చామని మీ పూర్తి వివరాలు చెప్పాలని ప్రజల్ని అడుగుతున్నారు. ముందుగా ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డు వివరాలు తెలుసుకుంటున్నారు. వాటిని రికార్డు చేసినట్లు నటిస్తున్నారు. అనంతరం నమ్మకం కుదిరాక బ్యాంకు అకౌంట్‌ డీటెయిల్స్‌, బయోమెట్రిక్‌ చేయాల్సి ఉందని చెబుతున్నారు. బయోమెట్రిక్‌ తర్వాత మొబైల్‌ నెంబర్‌కు ఓటీపీ వస్తుందని ఆ డీటెయిల్స్‌ కూడా చెప్పాలని అడుగుతున్నారు. వీరి ఉచ్చులో చిక్కుకున్న అమాయకులు ఓటీపీ చెప్పిన అనంతరం సైబర్‌ నేరాలకు పాల్పడి వారి ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఈ తరహా ముఠాలు తెలంగాణలోని కొన్ని పల్లెల్లో తిరుగుతున్నాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. జనాభా లెక్కలు, కుటుంబ సర్వే కోసం అని వచ్చే ప్రతి ఒక్కరిని నమ్మటానికి వీల్లేదని అంటున్నారు. వారెవరూ బ్యాంకు డీటెయిల్స్‌ కానీ.. బయోమెట్రిక్‌ కానీ.. ఓటీపీలు కానీ తీసుకోరని చెబుతున్నారు. ఇటువంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఓటీపీ, బ్యాంకు ఖాతాల వివరాలు ఇతరులకు షేర్‌ చేసి తప్పు చేయవద్దని సూచిస్తున్నారు. ఇలా ఎవరైనా అనుమానాస్పందగా బ్యాంకు అకౌంట్‌, ఓటీపీ వివరాలు అడిగితే ఆలస్యం చేయకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచిస్తున్నారు. సైబర్‌ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అవగాహన పెంచుకోవాలని అంటున్నారు. వీరి ఉచ్చులో చిక్కుకోవద్దని హెచ్చరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *