- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దరి దారుణ హత్య
- ఇంట్లోకి దూరి గొడ్డలితో దాడి
- ములుగు జిల్లా వాజేడులో ఘటన
పీపుల్స్‌డైరీ`వాజేడు : పోలీస్ ఇన్ఫార్మర్ల నెపంతో ఇద్దర్ని మావోయిస్టులు అతి దారుణంగా హత్య చేశారు. ఈ సందర్బంగా మావోయిస్టులు ఒ లేఖ విడుదల చేశారు. ఈ ఇద్దర్నీ పలుమార్లు హెచ్చరించినా వారు తీరు మార్చుకోలేదంటూ అందులో పేర్కొన్నారు. ఇంట్లోకి చొరబడి నిద్రపోతున్నవారిని నరికి చంపారు. వివరాలిలా ఉన్నాయి…. వాజేడు మండల కేంద్రంలో ఇన్ఫార్మర్ల నెపంతో ఇద్దరిని గొడ్డలితో నరికి దారుణంగా హత్యచేశారు. వాజేడు పెనుగోలు కాలనీలో పేరూరు పంచాయతీ కార్యదర్శి ఉయికా రమేశ్, అతడి బంధువు ఉయికా అర్జున్ను గురువారం అర్ధరాత్రి అతి కిరాతకంగా నరికి చంపారు. అనంతరం వారి మృతదేహాల వద్ద వెంకటాపురం-వాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి శాంత పేరిట మావోయిస్టులు రెండు లేఖలను వదిలి వెళ్లారు. రమేశ్‌ను గొడ్డలితో నరికిన సమయంలో అతడి భార్య గట్టిగా కేకలు వేయడంతో మావోయిస్టులు అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన రమేశ్‌ను ఏటూరు నాగారం ఆస్పత్రికి 108 వాహనంలో తరలిస్తుండగా మార్గమధ్యంలో అతడు మృతిచెందారు. రమేశ్, అర్జున్ ఇద్దరు తరచూ అడవిలోకి వెళ్తూ నక్సల్స్ కార్యకలాపాల గురించి ఎప్పటికప్పుడు పోలీసులకు సమాచారం ఇస్తున్నారని అనుమానం పెంచుకున్నారు. గతంలో ఇద్దరికీ హెచ్చరికలు చేసిన మావోయిస్టు పార్టీ.. తీరు మార్చుకోకపోతే చంపుతామని వార్నింగ్ ఇచ్చింది. ఈ క్రమంలో గురువారం రాత్రి వారి నివాసాల్లోకి నక్సల్స్ చొరబడ్డారు. ఇంట్లోకి వచ్చి నిద్రపోతున్నవారిపై గొడ్డలితో దాడిచేసి హతమార్చారు.