- అవమానాలను దిగమింగుతూ విధులు…
- జర్నలిస్టులపై కొందరు ప్రజాప్రతినిధుల చిన్నచూపు
పైకి లేపేది మీడియానే… కుర్చీ దింపేది మీడియానే…
పద్దతి మార్చుకోకపోతే వారికే క(న)ష్టం!
లీడర్లకు పదవులు కావాలి… ఆ పదవుల కోసం పబ్లిసిటీ కావాలి…. ఆ పబ్లిసిటీ కోసం విలేకరుల అండ కావాలి… చిన్న చిన్న కార్యక్రమాలకు కూడా ఫొటోలకు ఫోజులిచ్చి పేపర్లర్ల, టీవీలల్ల పేరుకోసం తపించే నాయకులు మంచి స్థాయికి రాగానే విలేకరులను పురుగుల్లా చూస్తుండడం గమనార్హం. ఇదే విలేకరులు తలుచుకుంటే వాళ్ల పదవులు కూడా ఊడుతాయనే విషయాన్ని గ్రహించాల్సిన అవసరం కూడా ఉంది. కొందరు నాయకులైతే తమ వద్దకు వచ్చే విలేకరులను అందరిముందే పూచిక పుల్లలా తీసిపారేస్తున్నారు. ఏరు దాటాక తెప్ప తగలెట్టినట్టుగా కొందరి నాయకుల తీరు ఉంది. మెజార్టీ విలేకరులు తమ పత్రిక ఆర్థిక అవసరాల రీత్యా యాడ్స్ కోసం ప్రజాప్రతినిధుల వద్దకు వెళ్తుంటారు. వాళ్లకు వీలైతే సహకరించాలి లేదా సున్నితంగా తిరస్కరించాలి. ఇందుకు భిన్నంగా కొందరు ‘‘మీ లెక్కంత… మీరెంత.. మీరు వార్తలు రాస్తే ఎంత.. రాయకుంటే ఎంత…’’ అన్నట్టుగా మాట్లాడుతుండడంతో పాపం విలేకరులు చిన్నబుచ్చుకుంటున్నారు.
డిసెంబర్ రాగానే ప్రతి విలేకరి తన సంస్థకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో, రాజకీయ నాయకుల కార్యాలయాల చుట్టూ తిరుగుతుంటాడు. సంస్థకు ఆర్థిక స్థిరత్వం తెచ్చేందుకు వారు చేసే ఈ కృషిని, రాజకీయ నాయకులు తమ నిర్లక్ష్య ధోరణితో అవమానపరుస్తున్నారు.
తమ ప్రచారానికి ఫ్రీ సేవలు:
రాజకీయ నాయకుల కార్యక్రమాలను సంవత్సరమంతా జర్నలిస్టులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు. అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు, ప్రభుత్వ ప్రాజెక్టులు వీటన్నింటినీ మీడియా ప్రజెంట్ చేసి ప్రజల దృష్టికి తీసుకెళ్తుంటాయి. ఒకరకంగా వారి ప్రతి కదలికలను మీడియా చూపిస్తూ నిత్యం ప్రజల్లో ఉండేలా విలేకరులు కృషిచేస్తుంటారు. కానీ డిసెంబర్ నెలలో యాడ్స్ కోసం అడిగితే, నాయకులు తమ స్వార్థమే ముందు పెట్టుకుని జర్నలిస్టుల్ని ‘రేపు రా, మాపురా’ అంటూ తిప్పుకుంటూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంటారు.
నిర్లక్ష్యపు ధోరణి:
రాజకీయ నాయకులు పత్రికా సేవలను ఉపయోగించుకోవడంలో మాత్రం ముందుంటారు. కానీ, విలేకరుల నిస్వార్థ కృషికి గౌరవం ఇవ్వడం, సంస్థల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలో సహకరించడం పట్ల పూర్తిగా నిర్లక్ష్యం చూపిస్తున్నారు. మేం సపోర్ట్ చేస్తాం అంటూ మాటలు చెబుతూ, ఆచరణలో మాత్రం వేరే విధంగా ప్రవర్తిస్తున్నారు.
యాడ్స్ కోసం విలేకరుల ఆరాటం:
అన్ని పత్రికలు యాడ్స్ ద్వారా వచ్చే రెవెన్యూ ద్వారానే మనుగడ సాగాయనే విషయం జగమెరిగిన సత్యం. ఇందుకోసం విలేకరులకు ఆయా సంస్థలు ఎంతో కొంత టార్గెట్ విధిస్తుంటాయి. సంవత్సరం పొడవునా నిత్యం వాళ్ల వార్తలు కవర్ చేసిన విలేకరులు ఏదో ఒక సందర్భంలో యాడ్స్ కోసం నాయకుల వద్దకు వెళ్తుంటారు. ప్రతి విలేకరి పండుగల సీజన్‌తో పాటు డిసెంబర్ నెలలో యాడ్స్ కోసం తన ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టి నాయకుల కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక విలేకరులను చూడగానే రాజకీయ నాయకులకు కోపం కట్టలు తెంచుతుంది. సంస్థలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో నడుస్తున్న జర్నలిస్టులపై ఈ విధమైన వ్యవహారం సరైనదా?
నాయకులు తీరును మార్చుకోవాలి:
రాజకీయ నాయకులు జర్నలిస్టుల కృషిని గౌరవించకపోతే, అది మరింత నిరాశ కలిగించే అంశంగా మారుతుంది. మీరెందుకు ఉన్నారు? మీ ప్రచారానికి మీరు బతిమాలే మీడియాను చివరికి తిరస్కరిస్తారా? అనే ప్రశ్నలు వారిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. జర్నలిస్టుల హక్కులకు గౌరవం ఇవ్వడం, వారి కృషికి సరైన ప్రతిఫలం ఇవ్వడం రాజకీయ నాయకుల బాధ్యత.
లోకంలోని అందరి సమస్యలపై వార్త రాసే విలేకరికే సమస్య ఎదురైతే ఎవ్వరికి చెప్పుకోవాలి? అన్నివర్గాలు తమ సమస్యలను జర్నలిస్టులకు చెప్పుకుంటారు… అందరి సమస్యను తన సమస్యగా భావించి వాళ్లకు న్యాయం చేయాలని చూస్తాడు విలేకరి. కానీ తన సమస్యనే ఎవరికీ చెప్పుకోలేక తనలో తానే కుమిలిపోతూ పైకి మాత్రం ఉత్సాహంగా లోకం చుట్టేస్తుంటాడు…