గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు
మండలంలోని రేలకుంట, రుద్రగూడెం గ్రామాల్లోని గుడుంబా స్థావరాలపై పోలీసులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై గోవర్ధన్ వివరాలు వెల్లడించారు. అమ్మకానికి సిద్ధంగా ఉన్న 24 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రేలకుంటకు చెందిన హలావత్ సమ్మయ్య, రుద్ర గూడెం శివారు చిన్నతండాకు చెందిన గుగులోత్ కేక్యాలపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. గుడుంబా తయారు చేసినా, విక్రయించినా చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దాడుల్లో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.