వీడిన పెద్దపులి భయం…
నల్లబెల్లి: గత మూడు రోజులుగా నల్లబెల్లి మండలంలో కనిపించిన పెద్ద పులి అడుగు జాడలు పలు గ్రామాల్లో అలజడి రేపుతున్నాయి. పెద్ద పులి అడుగుల ఆనవాళ్ల బట్టి రుద్రగూడెం శివారులోని చిట్టడివిలా ఉండే బోడు ప్రాంతంలో పులి సేద తీరినట్టు ఫారెస్ట్ రేంజ్ అధికారి రవి కిరణ్ తెలిపారు. కాగా ఆదివారం ఉదయం వచ్చిన సమాచారం మేరకు నర్సంపేట మీదుగా ఖనాపురం వైపు పెద్ద పులి అడుగులు ఉన్నట్టు తెలియడంతో పరిశీలించామన్నారు. ఇక్కడి పులి పాద ముద్రలు నల్లబెల్లి మండలంలో కనిపించిన పులి అడుగులను పోలి ఉన్నట్లు వారు చెప్పారు. దీనితో పులి రుద్రగూడెం బొడు నుంచి కాకతీయ గురుకులం వెనుకగా నరక్కపేట మీదుగా ముత్తోజీపేట చెరువు వైపు వచ్చినట్టు, అక్కడ నుంచి ముత్యాలమ్మ తండా, కీర్య తండా దాటి మహబూబాబాద్ పరిధిలోకి పోయినట్టు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సోమా తెలిపారు.