Year Ender 2024:తెలంగాణ పోలీసు సక్సెస్ రేటు ఎంత..!!
కాల గమనంలో మరో ఏడాది పూర్తయింది. 2024 కి వీడ్కోలు పలుకుతూ.. 2025 స్వాగతానికి సిద్దం అవుతోంది. ఈ 2024 లో తెలంగాణ లో శాంతి భద్రతల పరంగా పోలీసు శాఖ ఎన్నో సవాళ్లు ఎదుర్కొంది. మరెన్నో లక్ష్యాలను చేరుకుంది. ఈ ఏడాది చివర్లో హీరో అల్లు అర్జున్ అరెస్ట్ పోలీసు శాఖ కు ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఈ అరెస్ట్ పై దేశ వ్యాప్తంగా చర్చ జరిగింది. ఇక.. డ్రగ్స్ పైన ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. 2024లో క్రైమ్ రిపోర్టును డీజీపీ జితేందర్ వెల్లడించారు
రాష్ట్రంలో క్రైమ్ రేటు తెలంగాణలో గత ఏడాది కంటే 2024 లో క్రైమ్ రేటు పెరిగింది. ఈ ఏడాది 9.87శాతం కేసుల సంఖ్య అధికంగా నమోదైంది. ఒకటి రెండు ఘటనలు మినహా రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు లోనే ఉన్నాయని డీజీపీ జితేందర్ వివరించారు. ఈ ఏడాది మొత్తం 2,34,158 కేసులు నమోదు కాగా, 85మంది నక్సల్స్ అరెస్ట్ అయినట్లు వెల్లడించారు. మరో 41 మంది సరెండర్ అయ్యారని చెప్పుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 1942 డ్రగ్స్ కేసులు నమోదు కాగా అందులో 4682 మందిని అరెస్ట్ చేశారు. రూ 142.95 కోట్ల డ్రగ్స్ పట్టుకోగా .. జీరో శాతం డ్రగ్స్ దిశగా పోలీస్ శాఖ తగిన చర్యలు తీసుకుందని డీజీపీ వివరించారు.
పెరిగిన సైబర్ క్రైమ్ రాష్ట్రంలో ఈ ఏడాది సైబర్ క్రైమ్ నేరాలు పెరిగాయి. గత ఏడాది కంటే 43.33 శాతం మేర సైబర్ నేరాలు పెరిగినట్లు డీజీపీ చెప్పుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 25,184 సైబర్ క్రైమ్ కేసులు నమోదు కాగా.. 180 కోట్లు వదిలిన ఫండ్స్ రీఫండ్ అయ్యాయని చెప్పారు. కాగా, రూ 247 కోట్లు విలువైన ఆస్తులను ఫ్రీజ్ చేసినట్లు తెలిపారు. కొత్త చట్టాలు వచ్చిన తరువాత 85,190 కేసులు నమోదు అయ్యాయని వివరించారు. జీరో ఎఫ్ఐఆర్ కింద 1,313 కేసులు కొత్త చట్టాలు వచ్చిన తరువాత నమోదు చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది 547 మంది ఎస్ఐలు, 12,338 మంది కానిస్టేబుల్స్ నియామకం జరిగిందని చెప్పిన డీజీపీ… డయల్ 100 ద్వారా 16,92,173 కాల్స్ వచ్చినట్లు వివరించారు.