కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలి
- 42శాతం రిజర్వేషన్ ఇచ్చిన అనంతరం లోకల్ ఎలక్షన్స్
- బిజెపి ఓబీసీ మోర్చ జిల్లా అధ్యక్షులు పైండ్ల శ్రీనివాస్
మహబూబాబాద్ ,జనవరి 06(పీపుల్స్ డైరీ):
రాష్ట్రంలో వెంటనే కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ ఓబిసి మోర్చా మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు పైండ్ల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మహబూబాద్ జిల్లా బిజెపి జిల్లా కార్యాలయంలో ఓబీసీ మోర్చ సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా పైండ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో భాగంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్‌ను విడుదల చేసిందని గుర్తు చేశారు. దీనిని రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ, సిద్ధరామయ్య సమక్షంలో విడుదల చేశారన్నారు. అందులో పేర్కొన్న విధంగా అసెంబ్లీలో వెంటనే కులగణన బిల్లును ప్రవేశపెట్టి, ఆమోదింపజేసి చట్టబద్ధత కల్పించాలని కోరారు.రాష్ట్రంలో ఉన్న 55 శాతం బీసీలకు న్యాయం చేయాలని కోరారు.నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ హయాంలో బీసీలకు అన్యాయం జరిగిందని, బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే దేశం విచ్ఛిన్నం అవుతుందని రాజీవ్ గాంధీ అన్నారని ప్రస్తావించారు. 2011 కులగణన చేసిన నివేదికను అప్పటి యూపీఏ ప్రభుత్వం బహీర్గతం చేయలేదని ఎత్తిచూపారు.బీసీలకు ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ రెడ్డి విస్మరించారన్నారు. కనీస మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. బీసీ వర్గాల్లో ఉన్న 130 కులాలకు ఒక్కో కులానికి ఒక్కో సమస్య ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ వాటిని పరిష్కారం చేయడానికి మాత్రం ముఖ్యమంత్రికి మనసొప్పడం లేదని విమర్శించారు.బీసీల జనాభా ఎంత ఉంటే అంత వాటా ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలని సూచించారు. దొంగ లెక్కలు, కాకిలెక్కలు కాకుండా వాస్తవ లెక్కలు తీయాలని డిమాండ్ చేశారు. మాయదారి మాటలతో, మోసపూరిత పనులతో ప్రజలను మభ్య పెట్టవద్దని సూచించారు. రాజ్యాంగం రచించినప్పుడే బీసీలకు రాజ్యంగపరమైన రక్షణ కల్పించి ఉంటే అభివృద్ధిలో దేశం అమెరికాను దాటేసేదని అభిప్రాయపడ్డారు. బీసీలకు రాజ్యంగ రక్షణను సాధించడమే అంతిమ లక్ష్యమని, అందు కోసం రాజ్యంగ సవరణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. అయితే, దాన్ని దీర్ఘకాలిక లక్ష్యంగా పెట్టుకొని పోరాటం చేద్దామన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మోసంగి మురళి, శ్రీనివాస్, గణేష్, భరత్ ఇతరులు పాల్గొన్నారు.