కొత్తగూడెంలో విద్యార్థి ఆత్మహత్య
స్పెషల్ క్లాసులు, ర్యాంకుల పేరిట కళాశాల యాజమాన్యం వేధింపులను తాళలేక ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన భద్రాద్రి జిల్లాలో ఆదివారం చోటుచేసుకున్నది.
- స్పెషల్ క్లాసులు, ర్యాంకుల కోసం కళాశాల యాజమాన్యం ఒత్తిడి
- ఒత్తిడి తాళలేక ఇంటర్ సెకండియర్ విద్యార్థి బలవన్మరణం
చుంచుపల్లి, జనవరి 5: స్పెషల్ క్లాసులు, ర్యాంకుల పేరిట కళాశాల యాజమాన్యం వేధింపులను తాళలేక ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన భద్రాద్రి జిల్లాలో ఆదివారం చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. భద్రాద్రి జిల్లా చుంచుపల్లి మండలం విద్యానగర్‌కు చెందిన శనగ వెంకట లక్ష్మణ్ రావు భారతి దేవి దంపతుల కుమారుడు రాంపవర్ (18) స్థానిక లక్ష్మీదేవిపల్లిలోని శ్రీ నలంద జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. బాగాచదివే విద్యార్థులను కళాశాల బాధ్యులు సపరేట్ బ్యాచ్ చేసి, ఉదయం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రత్యేక క్లాసులు పెట్టి కాలేజీలోనే చదివిస్తున్నారు. రాంపవర్ విద్యానగర్ కాలనీలోని తన నానమ్మ, తాతయ్య ఇంటి వద్దనే ఉంటూ కాలేజీకి వెళ్తున్నాడు.
వారంరోజులుగా కళాశాలకు వెళ్లకుండా ఇంటి వద్దనే చదువుకుంటున్నాడు. కళాశాల బాధ్యులు సదరు విద్యార్థికి, అతడి తల్లిదండ్రులకు ఫోన్ చేసి, కాలేజీకి రావాల్సిందేనని, లేకుంటే హాల్ టికెట్ ఇవ్వబోమని స్పష్టం చేశారు. దీంతో ఒత్తిడికి గురైన రాంపవర్ ఆదివారం ఉదయం నాలుగు గంటలకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. విద్యార్థి తండ్రి ఫిర్యాదు మేరకు చుంచుపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై ఎస్‌ఐ రవికుమార్ స్పందిస్తూ.. రాంపవర్ కళాశాలకు వెళ్లని కారణంగా కాలేజీ బాధ్యులు అతడిని మందలించడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు.
ఆరోపణలు అవాస్తవం: చైతన్య, సీఈవో నలంద కాలేజీ, కొత్తగూడెం
గడిచిన 12 రోజుల్లో సదరు విద్యార్థి ఒక్క రోజు మాత్రమే కళాశాలకు వచ్చాడని, తామేమీ ఆ విద్యార్థిని వేధించడం లేదని చెప్పారు.