నేడు భోగి పల్లెల్లో మొదలైన సంక్రాంతి సందడి
సంక్రాంతి వేడుకలకు వేళయింది. నేటినుంచి మూడు రోజుల పాటు సంక్రాంతి సంబురాలు నిర్వహించుకోనున్నారు. ఇంటి ముంగిట కొత్త శోభను సంతరించే విధంగా రంగు రంగులతో ముత్యాల ముగ్గులు వేసేందుకు మహిళలు సిద్ధమయ్యారు. నేడు (సోమవారం) భోగి, మంగళవారం సంక్రాంతి, బుధవారం కనుమ పండగలను నిర్వహించుకోనున్నారు. పండగను పురస్కరించుకొని పిండి వంటకాల తయారీలో మహిళలు బిజీగా ఉన్నారు. సంక్రాంతి సెలవులు రావడంతో విద్యార్థులు, ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారు, బంధువులు ఇళ్లకు చేరడంతో ఊళ్లలో పండగ వాతావరణం సంతరించుకుంది. రైతన్నలు పండించిన పంటలు ఇళ్లకు చేరడంతో ఆవు పేడ, గరక, పిండి గడ్డితో గౌరమ్మలను తయారుచేసి నవ ధాన్యాలలో ఇంటి గుమ్మాలు, వాకిళ్లలో అలంకరించనున్నారు. హరిదాసు కీర్తనలతో పాటు గంగిరెద్దులు విన్యాసాలు చేయనున్నాయి.