డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం
– జిల్లా ఎస్పి కిరణ్ ఖరే ఐపీఎస్
గణపురం, మార్చ్ 20 (పీపుల్స్ డైరీ): డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించేందుకు యువత, విద్యార్థులు, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి, ఉజ్వల భవిష్యత్ కోసం బాటలు వేసుకోవాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి కిరణ్ ఖరే ఐపిఎస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గంజాయి, డ్రగ్స్ మహమ్మారిని ప్రారంభ దశలోనే గుర్తించి, నివారించాలని, డ్రగ్స్, గంజాయి విక్రయ దారులు యువతనే లక్ష్యంగా చేసుకుని తమ కార్యకలాపాలను కొనసాగిస్తారని, యువత మాదకద్రవ్యాలకు అలవాటు పడడం వలన క్రమేపి ఆరోగ్యం క్షీణించడంతో పాటు అది ఒక వ్యసనంగా మారుతుందని, నేర ప్రవృత్తి వైపు దారితీస్తుందన్న విషయం గమనించాలని పేర్కొన్నారు. తద్వారా కుటుంబ సభ్యులు, బందువులకు దూరమవుతారని అన్నారు. చెడు అలవాట్లకు బానిసై, యువత చెడిపోవద్దని ఎస్పి సూచించారు. దీనిపై యువత చైతన్యం కలిగి ఉండాలన్నారు. డ్రగ్స్ వినియోగిస్తే చాల దుష్పరిణామాలు, చూపుతాయని పేర్కొన్నారు. జిల్లాలో డ్రగ్స్, గంజాయి సంబధిత సమాచారం తెలిస్తే 87126 58111 నెంబర్ కు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని, డ్రగ్స్, గంజాయి నిర్మూలనలో ప్రజలు భాగస్వాములు కావాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఎస్పీ పేర్కొన్నారు. డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాలు విక్రయిస్తే చట్ట పరంగా కఠిన చర్యలు తప్పవని ఎస్పి కిరణ్ ఖరే హెచ్చరించారు.