తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కొత్త పథకం ‘రాజీవ్ యువ వికాసం’ కు యువత నుండి విపరీతమైన స్పందన లభిస్తోంది. అయితే, ఈ ఉత్సాహానికి సాంకేతిక సమస్యలు అడ్డుపడుతున్నాయి. పథకానికి దరఖాస్తు చేసేందుకు రూపొందించిన అధికారిక వెబ్ సైట్ tgobmmsnew.cgg.gov.in గత కొన్ని రోజులుగా తరచుగా డౌన్ అవుతోంది. దాంతో దరఖాస్తుదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఈ నేపథ్యంలో ఏప్రిల్ మాసంలో వచ్చే వరుస ప్రభుత్వ సెలవులు, వారాంతపు సెలవులు కారణంగా మీసేవ కేంద్రాలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు కూడా పూర్తిస్థాయిలో పనిచేయడం లేదు. ఫలితంగా యువతకు ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్ దరఖాస్తుల ప్రక్రియలోనూ ఆటంకాలు తలెత్తుతున్నాయి. పలు చోట్ల మీసేవ కేంద్రాల వద్ద వెయిటింగ్ పెరిగిందని, తహసీల్దార్, మున్సిపల్ కార్యాలయాల్లో సిబ్బంది లేనందున అప్లికేషన్ ప్రాసెస్ ఆగిపోయిందని యువత వెల్లడిస్తున్నారు. ఇప్పటికే ఒకసారి గడువు పొడిగించబడిన ఈ పథకానికి, ఏప్రిల్ 14 చివరి తేది కాగా… దరఖాస్తుదారులు గడువును మళ్లీ పొడిగించాలని కోరుతున్నారు. అయితే, దీనిపై ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టమైన ప్రకటన రాలేదు. ఈ పరిస్థితుల్లో హెల్ప్ లైన్ నంబర్ 040-23120334 ద్వారా సాయం పొందవచ్చని అధికారులు సూచిస్తున్నారు.