
గడువు తీరిన పురుగుల మందులు పెద్ద మొత్తంలో నిల్వ చేశారన్న విశ్వసనీయ సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు స్థానిక నల్లబెల్లి పోలీసులతో కలిసి దాడి చేసిన సంఘటన నల్లబెల్లి మండలంలోని రేలకుంటలో చోటుచేసుకుంది. రేలకుంట గ్రామానికి చెందిన దేవ సుధీర్ బాబు అనే వ్యక్తి స్థానికంగా శ్రీ సుధీర్ ఫెర్టిలైజర్ అనే పేరుతో షాపును ఏర్పాటు చేశారు. ఖరీఫ్ సీజన్ మొదలవడంతో ఎరువులు, పురుగు మందులు విక్రయిస్తున్నాడు.
ఈ క్రమంలో పెద్ద మొత్తంలో గడువు తీరిన పురుగు మందులు అక్రమంగా నిల్వ చేశాడని టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో పక్కా పథకంతో దాడి చేసి దాదాపు రూ.15 లక్షల విలువ గల పురుగు మందులను స్వాధీనం చేసుకున్నారు. దేవ సుధీర్ పై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. తదుపరి విచారణ కోసం స్వాధీనం చేసుకున్న పురుగుమందులను నల్లబెల్లి పోలీస్ స్టేషన్ కి తరలించినట్లు అధికారులు స్పష్టం చేశారు.