భద్రాద్రి రామయ్య గోటి తలంబ్రాలకు అంకురార్పణ

గణపురం, జూలై 13 (పీపుల్స్ డైరీ): మండలంలోని చెల్పూర్ గ్రామంలోని శ్రీరామదాసు భక్త మండలి ఆధ్వర్యంలో భద్రాద్రి రామయ్య కళ్యాణానికి ఉపయోగించే కోటి గోటి తలంబ్రాల తయారీకి అంకురార్పణ చేశారు. ఈ భాగంగా ఆదివారం భద్రాద్రి రామయ్య సన్నిధిలో పంటకు వినియోగించే విత్తనపు వడ్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమం అంతరం చెల్పూర్ గ్రామానికి చెందిన శ్రీ రామదాసు తిరుపతమ్మ-తిరుపతి పుణ్య దంపతుల వ్యవసాయ క్షేత్రంలో నాటి వడ్లుపండించనున్నారు. ఈ ధాన్యాన్ని రామదాసు తిరుపతమ్మ-తిరుపతి దంపతులు వారి స్వంత క్షేత్రంలో పలుమార్లు పూజలు నిర్వహించి పండిస్తారు. ఇలా పండించిన ధాన్యాన్ని భక్తుల సహకారంతో అత్యంత భక్తిశ్రద్ధలతో గోటితో ఒలిపించి సీతారాముల కల్యాణానికి వినియోగిస్తారు. ఈ కార్యక్రమాన్ని 9 ఏళ్లుగా నిర్వహిస్తున్నామని రామదాసు తిరుపతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు భక్తులు పాల్గొన్నారు.