యూరియా రాకపాయె.. కునుకు కరువాయె
ఒక్క బస్తా కోసం రేయింబవళ్లు రైతుల పడిగాపులు
క్యూలైన్లలో చెప్పులు.. ఆధార్లు.. రైతుల కుస్తీలు.
నల్లబెల్లి సెప్టెంబర్ 14 పీపుల్స్ డైరీ

ఈ సీజన్లో రైతులకు యూరియా కష్టాలు ఇప్పట్లో తప్పేలా లేవు. యూరియా కొరత రైతులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నది. వ్యవసాయ పనులు వదిలేసి రాత్రి, పగలు అనే తేడా లేకుండా సొసైటీల ఎదుట పడిగాపులు పడుతున్నారు నల్లబెల్లి మండల కేంద్రంలో గ్రోమోర్ కి యూరియా వచ్చిందన్న సమాచారం తెలుసుకున్న రైతులు ఆదివారం తెల్లవారుజామునే గోదాం వద్ద వరుస కట్టారు. రైతు వద్ద నుంచి ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ బుక్ జిరాక్స్ ప్రతులను తీసుకొని ఒక రైతుకు ఒక యూరియా బస్తా ఇస్తున్నట్లు తెలిపారు. ఒక యూరియా బస్తాతో తమ కష్టాలు తీరేలా లేవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే యూరియా చల్లుకోవలసి ఉండేనని యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. పంట చేల వద్దకు వెళితే ఆకు పచ్చగా ఉండాల్సిన పొలాలు అన్ని పసుపుపచ్చగా మారిపోతున్నాయని పంటల దిగుబడి పై ప్రభావం చూపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. రైతులకు ఇచ్చే యూరియా బస్తాల సంఖ్య పెంచాలని కోరుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటే గాని యూరియా దొరకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ చూడలేదన్నారు. యూరియా కొరత ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధులు మాత్రం కొరత లేదని చెప్పడం విడ్డూరంగా ఉందని, యూరియా దొరకని రైతులు నిరాశతో వెనుదిరిగారు