-
రహ‘దారిద్య్రం’ వార్తకు విశేష స్పందన
-
నేడు ఆందోళనలకు బీఆర్‌ఎస్ పిలుపు
పీపుల్స్‌డైరీ – భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి
రహ‘దారిద్య్రం’ శీర్షికన ఆదివారం ‘పీపుల్స్‌డైరీ’ దినపత్రికలో ప్రచురితమైన వార్తకు రాజకీయ పార్టీలు, భద్రాచలం ప్రాంత ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. న్యూస్ క్లిప్పులను నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ప్రజోపయోగమైన కథనం అని ప్రశంసించారు. ‘పీపుల్స్‌డైరీ’ ప్రతినిధికి పలువురు అధికార, అనధికార ప్రముఖులు ఫోన్ చేసి చక్కని కథనమని అభినందించారు. ట్రాఫిక్ స్తంభన సమస్యకు పరిష్కారం వచ్చేవరకు, ముఖ్యంగా ములుగు మీదుగా ఇసుక లారీలు వెళ్లే వరకు ఇలాంటి కథనాలు మీడియాలో వెలువడాలని ఆకాంక్షించారు. ఇసుక లారీల వలన ప్రజలు ఎదుర్కొంటున్న రహదారి, ట్రాఫిక్ ఇబ్బందులను, ముఖ్యంగా ములుగు వైపు చర్ల మండలంలోని ఇసుక ర్యాంపుల లారీలు వెళ్లకుండా ఆ జిల్లా అధికారులు సరిహద్దులో అడ్డుకుంటున్న తీరును కళ్లకు కట్టినట్లుగా వార్తా కథనంలో వివరించిన ‘పీపుల్స్ డైరీ’ దినపత్రికకి జనం జేజేలు పలుకుతున్నారు. ఇసుక ర్యాంపుల మూలంగానే మన్యం ప్రజలు ప్రయాణంలో ముప్పు తిప్పలు పడుతున్నారని అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం ఆగ్రహంతో ఉన్నారు. ఈ ప్రజా సమస్యపై ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ సోమవారం చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో రహదారి దిగ్బంధన నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. పార్టీలకు అతీతంగా ప్రజలు ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొనాలని బిఆర్‌ఎస్ చర్ల మండల కన్వీనర్ దొడ్డి తాతారావు, దుమ్మగూడెం మండల బిఆర్‌ఎస్ కన్వీనర్ కణితి రాముడు, కోకన్వినర్ జానీ పాషా విజ్ఞప్తి చేశారు. ఉన్నతాధికారులు వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చి సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టే వరకు రోడ్డుపై నుంచి నిరసనకారులు కదిలేదిలేదని బిఆర్‌ఎస్ నాయకత్వం హెచ్చరిస్తోంది. అటు ములుగు వైపుకి, ఇటు భద్రాచలం మీదుగా రెండు వైపుల ఇసుక లారీలు వెళ్ళడానికి మార్గం సుగమం చేస్తే ట్రాఫిక్ స్తంభన సమస్య ఇలా తలెత్తేదికాదని చర్ల మండల ప్రజలు అభిప్రాయపడుతున్నారు. భద్రాద్రి గిరిజన ప్రాంత ప్రజల రవాణా సమస్యపై ములుగు జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి సీతక్క తక్షణమే జోక్యం చేసుకుని రెండు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో మాట్లాడి ట్రాఫిక్ స్తంభన సమస్య పరిష్కరించి భద్రాద్రి మన్యం ప్రజలకు మేలు చేయాలని ముక్త కంఠంతో కోరుతున్నారు. అదే క్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు సైతం భద్రాచలం ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్ర ట్రాఫిక్ స్తంభన సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. ఈ సమస్యపై పాలకులు లేదా అధికార పార్టీ నాయకులు ఇంకా నిర్లక్ష్యం చేస్తే ఈ ప్రభావం వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీపై చూపించే ప్రమాదం లేకపోలేదు.
