సోషల్‌ ‘రగడ’

  • రగులుతున్న ‘జూబ్లీహిల్స్‌’ వేడి
  • వాట్సప్‌ గ్రూపుల్లో ఉప ఎన్నిక వార్‌
  • బీఆర్‌ఎస్‌.. కాంగ్రెస్‌ శ్రేణుల నడుమ పోస్టింగ్స్‌ యుద్ధం
  • ఇదేం గోలని చీదరించుకుంటున్న నెటిజన్లు
  • నిశితంగా గమనిస్తున్న నిఘావర్గాలు
  • శృతిమించితే కేసులు పెట్టే చాన్స్‌

పీపుల్స్‌ డైరీ-పొలిటికల్‌ బ్యూరో

రాష్ట్ర రాజధాని నడిబొడ్డున జరుగుతున్న జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక వేడి రాష్ట్రమంతా రగులుతోంది. ఈ ఉప ఎన్నిక అధికార పార్టీని ఆదరిస్తుందా, ప్రతిపక్ష పార్టీకి పట్టం కడుతుందా అనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఈ ఎన్నిక అనంతరం రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రంలో పెనుమార్పులు చోటుచేసుకునే అవకాశం లేకపోలేదనేది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. అక్కడ గెలుపు, ఓటమిలపై అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బిఆర్‌ఎస్‌ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానుల నడుమ ముఖ్యంగా వాట్సప్‌, అరట్టాయ్‌ వంటి సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలలో విమర్శల యుద్ధం కొనసాగుతోంది. ఈ విమర్శలు పార్టీల పనితీరు సిద్ధాంతాలు, విధానాలు, ఎన్నికలకు పరిమితం కాకుండా కొందరు పార్టీ పిచ్చోళ్ళు నువ్వెంతంటే నువ్వెంత అన్నట్లుగా వ్యక్తిగత ఆరోపణలకు దిగుతున్నారు. ఇది జుగుప్సాకరమైనదిగా పలువురు భావిస్తున్నారు. అయితే ఇప్పటికే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సోషల్‌ మీడియా గ్రూపుల్లో చేరి ఉన్న పోలీసు, ఇంటిలిజెన్స్‌ విభాగాల సిబ్బంది రాజకీయ శ్రేణుల పోస్టింగులను నిశితంగా గమనిస్తున్నారు. విమర్శలు పార్టీల సిద్ధాంతాలు, విధానాలకు పరిమితం గాకుండా వ్యక్తిగత విమర్శలకు దిగితే తగిన ఆధారాలు లేదా ఫిర్యాదులతో కేసులు నమోదు చేయడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారు. జూబ్లీహిల్స్‌లో గెలుపు మాదే అంటే కాదు మాదే అనడమే గాకుండా గతంలో మీరు ప్రజలకు చేసింది ఏమీ లేదని కాంగ్రెస్‌ వాళ్ళు అంటుంటే ఇపుడు మీరు చేస్తున్నది కూడా ఏమీలేదని బిఆర్‌ఎస్‌ వాళ్ళు విమర్శలు సంధించుకుంటున్నారు. నువ్వు నన్ను ఒకటి అంటే నేను నిన్ను రెండు అంటా అనే సామెతలా అధికార, ప్రతిపక్ష పార్టీల వాళ్ళు పరస్పరం విమర్శలు చేసుకుంటూ నెటిజన్లకు విసుగు పుట్టిస్తున్నారు. సోషల్‌ మీడియా వేదికల ద్వారా ప్రజలను ఆకట్టుకునేందుకు పార్టీల శ్రేణులు అవాస్తవ, సృష్టించిన పోస్టులను వైరల్‌ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ రాజకీయ రొచ్చు భరించడం కంటె బయటకు వెళ్ళిపోవడం బెటర్‌ అని కొందరు సోషల్‌ మీడియా గ్రూపుల నుంచి లెప్ట్‌ అవుతుంటే, మరికొందరు సైలెంట్‌ మోడ్‌లోకి పోతున్నారు. ఎక్కడో జరిగే ఎన్నిక కోసం ఇక్కడ ఎందుకు ఆధిపత్య పోరు అనేది నెటిజన్ల కామెంట్‌.

బెట్టింగులకు సై…

ఇంకా జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వం పూర్తి కాలేదు. బరిలో నిలిచేది.. వైదొలగేది ఎవరనేది తేలలేదు. కానీ గెలుపు ఓటమిలపై విమర్శలు చేసుకుంటున్న కాంగ్రెస్‌, బిఆర్‌ఎస్‌ లీడర్లు మాత్రం అప్పుడే బెట్టింగులకు సిద్ధమౌతున్నారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో బిఆర్‌ఎస్‌ విజయం ఎప్పుడో ఖాయమైందని, మెజారిటీ పెంచడం కోసమే పార్టీ క్యాడర్‌ కష్టపడాలన్న బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కెటిఆర్‌ మాటలను వంటబట్టించుకున్న గులాబీ శ్రేణులు అదే ధీమాతో బెట్టింగులకు సై అంటున్నారు. మరోవైపు అధికారాన్ని అనుభవిస్తున్న కాంగ్రెస్‌ లీడర్లు తమ పార్టీ గెలిచినట్లే ఊహించుకుంటూ బెట్టింగులకు సిద్ధమవుతున్నారు. అయితే జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక కాంగ్రెస్‌ ప్రభుత్వ పనితీరుకు, బిఆర్‌ఎస్‌ పట్ల ప్రజాదరణకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తుందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇక్కడ గెలిచిన పార్టీకి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాదరణ పెరిగే అవకాశం ఉంటుందనేది పరిశీలకుల భావన. ఈ నేపథ్యంలోనే జూబ్లీహిల్స్‌ ఎలక్షన్‌ ఫీవర్‌ రాష్ట్రమంతా వ్యాపిస్తోంది…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *