పోరాడితే పోయేదేమీ లేదు… బానిస సంకెళ్లు తప్ప…

  • బీసీ రిజర్వేషన్ కోసం బంధ్ విజయవంతం చేయాలి
  • ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు ఆకుల సుభాష్ ముదిరాజ్
  • ప్రతి బీసీ బిడ్డ శాంతియుతంగా పాల్గొనాలి…

గణపురం (పీపుల్స్ డైరీ): బీసీ హక్కుల కోసం సాగుతున్న పోరాటం చరిత్రాత్మకమని, ఈ సారి వెనక్కి తగ్గే పరిస్థితి ఏదీ లేదని ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు ఆకుల సుభాష్ ముదిరాజ్ స్పష్టం చేశారు. “పోరాడితే పోయేదేమీ లేదు… బానిస సంకెళ్లు తప్ప…” అని నినదిస్తూ, బీసీ రిజర్వేషన్ సాధనే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్ర బీసీ కుల సంఘాలు శనివారం (నేడు) 18న రాష్ట్ర వ్యాప్తంగా హామీ చేసిన బీసీ రిజర్వేషన్లను సాధించేందుకు బీసీ బంధ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ బంధ్‌ను ప్రతీ బీసీ సోదరుడు, సోదరీమణి స్వచ్ఛందంగా విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజాసంఖ్యా నిష్పత్తి మేరకు బీసీలకు కనీసం 42 శాతం రిజర్వేషన్ తప్పదని అన్నారు. “ఇది మన బలం, మన ఐక్యత, మన వాదం ప్రభుత్వాలకు వెన్నులో వణుకు పుట్టించే రోజుగా మలచాలి” అని పిలుపునిచ్చారు. బీసీ సమాజం ఒకే వేదికపై కూడి, తమ హక్కుల సాధనలో ఏకమవ్వాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. తమ భవిష్యత్తు కోసం, రాబోయే తరం కోసం ఈ బంధ్‌ను శాంతియుతంగా, కానీ సంకల్పంతో జరపాలని ఆయన సూచించారు. “ప్రతి బీసీ బిడ్డ ఈ బంధ్‌లో భాగస్వామి కావాలి, మన బలాన్ని ప్రభుత్వం గుర్తించేలా చూపుదాం” అని ఆకుల సుభాష్ ముదిరాజ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *