
గణపురం బస్టాండ్‌లో మూత్రశాల, మరుగుదొడ్లకు తాళం…!
– ప్రయాణికులు ‘వాటిని’ ఆపుకోవాల్సిందేనా?
– తాళాలు తొలగించి వినియోగానికి తేవాలని డిమాండ్
– గాంధీనగర్ జంక్షన్‌లో కూడా ఇదే పరిస్థితి
– ఇబ్బందుల్లో వందలాది ప్రయాణీకులు
– మూత్రశాలల మూసివేతపై విమర్శలు వెల్లువ
– అధికారుల నిర్లక్ష్యం పట్ల జనం మండిపాటు
గణపురం, (పీపుల్స్ డైరీ) : గణపురం మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద మూత్రశాలలు, మరుగు దొడ్లకు తాళాలు వేయడంతో బస్సు కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులు, మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యేకంగా వృద్ధులు, శారీరకంగా బలహీనులైన వారు ఈ సమస్యను బేడగా ఎదుర్కొంటున్నారు. ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తూ మూత్రశాలలు మూసి వేయడం వల్ల ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికీ పెద్ద కష్టమే,’’ అని అంటున్నారు. బస్సుకోసం ఎదురుచూసే మహిళలు, వృద్ధులు మరింత ఇబ్బందులకు గురికావాల్సిన పరిస్థితి నెలకొంది. మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల ప్రజలు ఈ బస్టాండ్ నుంచే ప్రయాణాలు రాకపోకలు కొనసాగిస్తుంటారు. మరుగుదొడ్లు, మూత్రశాలలు మూసివేయడంతో అత్యవసర సమయంలో బిగపట్టుకుని ఎంత సమయం ఓపికపట్టాలని ప్రశ్నిస్తున్నారు. అలాగే గణపురం మండలంలోని గాంధీ నగర్ (క్రాస్ రోడ్) లోని బస్టాండు వద్ద కూడా సరైన మూత్రశాలలు లేక స్త్రీలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. క్రాస్ రోడ్ నుంచి నిత్యం వందలాది మంది ప్రయాణికులు భూపాలపల్లి, గోదారిఖని, కాళేశ్వరం, హన్మకొండ లాంటి పట్టణాలకు ప్రయాణిస్తుంటారు. ఇక్కడ శుభ్రతకు సంబంధించి కూడా బాధాకర పరిస్థితులున్నట్లు చెప్పుతున్నారు. అలాగే క్రాస్‌రోడ్డులో బస్టాండును విస్తరించాల్సిన అవసరం కూడా ఉంది. స్థానిక ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకుని ఆర్టీసీ శాఖ అధికారులతో మాట్లాడి వెంటనే మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రయాణీకులు కోరుతున్నారు. గణపురం మండల కేంద్రంలోని బస్టాండ్, గాంధీనగర్ (క్రాస్ రోడ్) ప్రాంతాల్లో శుభ్రతతో కూడిన, మూత్రశాలలు, మరుగు దొడ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

