ప్రియురాలి కోసం ప్రాణాలతో ఆట..! టవర్ ఎక్కిన యువకుడు

ప్రియురాలి కోసం ప్రాణాలతో ఆట..! టవర్ ఎక్కిన యువకుడు

– గణపురం మండలంలో ఉద్రిక్తత
– ఫోన్ బ్లాక్‌తో ఆవేశం.. హైటెన్షన్ టవర్‌పైకి ఎక్కి హంగామా
– “ప్రేయసిని పిలిస్తేనే దిగుతా” అంటూ బెదిరింపులు
– రెండు గంటలపాటు ఉత్కంఠ.. గ్రామంలో కలకలం
– సీఐ చాకచక్యం.. సురక్షితంగా కిందకు దింపిన పోలీసులు

పీపుల్స్ డైరీ, గణపురం:

ప్రేయసి ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేయడంతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు హైటెన్షన్ విద్యుత్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన శుక్రవారం గణపురం మండలంలో కలకలం రేపింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం… గణపురం మండలంలోని ధర్మారావుపేట గ్రామానికి చెందిన సూర రాజు కొంతకాలంగా ఓ యువతి వెంటపడుతున్నాడు. అయితే ఆమె స్పందించకపోవడంతో పాటు అతని ఫోన్ నంబర్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది. దీంతో ఆగ్రహానికి లోనైన రాజు, సమీపంలోని మోరంచ గ్రామ శివారులో ఉన్న హైటెన్షన్ విద్యుత్ టవర్‌పైకి ఎక్కాడు. యువతిని వెంటనే అక్కడికి పిలిపించి మాట్లాడిస్తేనే దిగుతానని పట్టుబట్టాడు. లేకపోతే కిందకు దూకేస్తానంటూ బెదిరింపులకు దిగడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. సీఐ కరుణాకర్ రావు స్వయంగా రంగంలోకి దిగి సుమారు రెండు గంటల పాటు యువకుడితో చర్చలు జరిపారు. ఓర్పుతో నచ్చజెప్పి చివరకు అతడిని సురక్షితంగా కిందకు దింపడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అనంతరం యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఘటనపై విచారణ కొనసాగిస్తున్నారు. స్థానికంగా ఈ సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *