పిడుగుల బీభత్సం.. నాలుగు రోజుల వ్యవధిలో ఐదుగురు బలి..!
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పిడుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. పొట్టకూటి కోసం వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, రైతు కూలీలు పిడుగుపాటుకు పిట్టల్లా రాలిపోతున్నారు. కేవలం నాలుగు రోజుల వ్యవధిలో ఐదుగురు వేరువేరు ప్రాంతాల్లో పిడుగుపాటుకు ప్రాణాలు కోల్పోయాయి. తాజా ఘటనలో ఓ విద్యార్థినితో సహా యువరైతు మృతి చెందారు. గత వారం రోజుల నుండి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పిడుగుల బీభత్సం సృష్టిస్తున్నాయి.. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అమాయకుల ఆయువు మింగేస్తున్నాయి. కేవలం నాలుగు రోజుల వ్యవధిలో ఐదుగురు రైతులు వ్యవసాయ క్షేత్రాల్లో పనులు చేసుకుంటూ పిడుగుపాటుకు బలయ్యారు. గురువారం(అక్టోబర్ 3) సాయంత్రం పిడుగుపాటుకు గురై ఆత్మకూరు మండలం చౌవులపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు మహిళా రైతులు మృతి చెందారు. పత్తి చేనులో చేస్తుండగా పిడుగుపడి రామ, నిర్మల అనే ఇద్దరు అత్తా కోడళ్ళుగా అక్కడికక్కడే మృతి చెందారు. అదే రోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రంగయ్యపల్లి గ్రామంలో పిడుగుపాటుతో లక్ష్మి (45) అనే మహిళా రైతు మృతి. చెందింది. ఇక, తాజాగా ఐనవోలు మండలం వెంకటాపురం గ్రామంలో పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందారు. మృతులు శ్రావణి అనే ఇంటర్ విద్యార్థిని తోపాటు, కూకట్ల రాజు అనే యువ రైతుగా గుర్తించారు. వారి వ్యవసాయ క్షేత్రంలో పనులు చేస్తుండగా ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. ఈ క్రమంలో పక్కనే ఉన్న పశువుల కొట్టం కిందకు వెళ్తుండగా పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ సంఘటనలో మృత్యువాత పడ్డ ఇద్దరూ అవివాహితులే. దీంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.