- బరబర మండిన హన్మంతుడి విగ్రహం
- ఊరికి అరిష్టం జరిగేనా?
- భూపాలపల్లి జిల్లాలో ఘటన
- ప్రమాదమా…? కుట్ర జరిగిందా?
పీపుల్స్‌డైరీ`భూపాలపల్లి : హనుమంతుడి విగ్రహం మంటలబారిన పడిరది. భగభగమంటూ మండి పూర్తిగా దగ్ధమైంది. ఉన్నట్టుండి మంటలు చెలరేగడం పట్ల స్థానికుల్లో భయాందోళనలు వ్యక్తమౌతోన్నాయి. భూపాలపల్లి జిల్లాలోని మహాదేవ్‌పూర్ మండలం అంబటిపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రఖ్యాత అమరేశ్వర స్వామివారి ఆలయం ఉన్నది ఈ గ్రామంలోనే. రోజూ భక్తులు ఆలయానికి వస్తుంటారు. ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఈ ప్రాంగణంలో గల ఉప ఆలయాల్లో ఒకటైన ఆంజనేయ స్వామి గర్భగుడిలో అంతుచిక్కని విధంగా అగ్నికీలలు వ్యాపించాయి. హనుమంతుడి విగ్రహం పూర్తిగా దగ్ధమైంది. మంటలు చెలరేగినట్లు సమాచారం తెలిసిన వెంటనే గ్రామస్తులు హుటాహుటిన ఆలయానికి చేరుకున్నారు. మంటలను ఆర్పివేశారు. మంటల వల్ల గర్భగుడి మొత్తం పొగచూరింది. అక్కడి వస్తువులు, పూజా సామాగ్రి అగ్నికి మొత్తం అహూతి అయింది. స్వామివారి వస్త్రాలు కాలిపోయాయి. ఇది ప్రమాదమా? లేక కుట్రా అనేది తేలట్లేదు. ఉద్దేశపూరకంగా ఎవరైనా నిప్పంటించి ఉంటారా? లేక దీపాల వల్ల మంటలు అంటుకుని ఉంటాయా? అనేది నిర్ధారణ కావట్లేదు. హనుమంతుడి విగ్రహం మాత్రమే ఉన్నట్టుండి మంటల బారిన పడటం పట్ల గ్రామస్తుల్లో భయాందోళనలు వ్యక్తమౌతోన్నాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంజన్న విగ్రహం దగ్ధం కావడం ఊరికి అరిష్టం అనే ఆందోళన నెలకొంది. కాగా ఈ ఘటనపై గ్రామస్తులు, ఆలయ అర్చకులు, దేవస్థానం కమిటీ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు.