మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో హైడ్రా కూల్చివేతలు

మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో హైడ్రా కూల్చివేతలు

పీపుల్స్ డైరీ :

హైడ్రా.. తాజా కూల్చివేతలను చేపట్టింది. శేరిలింగంపల్లి పరిధిలోని ఖానామెట్ అయ్యప్ప సొసైటీలో అక్రమంగా నిర్మాణంలో ఉన్న భారీ అపార్ట్‌మెంట్‌ను కూల్చివేస్తోంది. కొద్దిసేపటి కిందటే దీనికి సంబంధించిన పనులు మొదలయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారక్కడ.

 

ఖానామెట్ అయ్యప్ప సొసైటీలో 684 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ అపార్ట్‌మెంట్ నిర్మితమైంది. ప్రస్తుతం ఇది నిర్మాణ దశలో ఉంది. దాదాపుగా పూర్తి కావొచ్చింది. ఈ అపార్ట్‌మెంట్ అక్రమ నిర్మాణమంటూ స్థానికుల నుంచి హైడ్రాకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. హైకోర్టు, జీహెచ్ఎంసీ ఆదేశాలు జారీ చేసినప్పటికీ అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయంటూ స్థానికులు హైడ్రా దృష్టికి తీసుకొచ్చారు.

 

వీటిని దృష్టిలో ఉంచుకుని శనివారమే హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌, జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ అధికారులు అయ్యప్ప సొసైటీని సందర్శించారు. 100 ఫీట్ రోడ్ పక్కనే నిర్మాణంలో ఉన్న ఈ అపార్ట్‌మెంట్ అక్రమ నిర్మాణమని నిర్ధారించారు. హైకోర్టు ఆదేశాలు, ఆ తరువాత జీహెచ్‌ఎంసీ ఇచ్చిన కూల్చివేత నోటీసులను కూడా బిల్డర్‌ బేఖాతర్ చేశాడని తేలింది. సెల్లార్, జీ ప్లస్ 5 అంతస్తులు కలిగి ఉన్న ఈ భవనం అక్రమ నిర్మాణమంటూ 2024 ఫిబ్రవరిలో ఆదేశాలు జారీ అయ్యాయి. హైకోర్టు కూడా దీన్ని అక్రమ నిర్మాణంగా నిర్ధారించింది. దానిపై చర్య తీసుకోవాలని ఆదేశించింది. గత ఏడాది జూన్‌లో జీహెచ్ఎంసీ మరోసారి నోటీసులు ఇచ్చినప్పటికీ బిల్డర్ స్పందించలేదు. దీనితో ఈ భవనాన్ని పాక్షికంగా కూల్చివేశారు జీహెచ్ఎంసీ అధికారులు.

 

అయినప్పటికీ- నిర్మాణం మాత్రం నిరాటంకంగా కొనసాగింది. దీనితో హైడ్రా రంగ ప్రవేశం చేసింది. స్వయంగా కమిషనర్ రంగనాథ్ దీన్ని పరిశీలించారు. డాక్యుమెంట్లు, గతంలో జీహెచ్ఎంసీ, హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను పరిశీలించారు. అక్రమ నిర్మాణమంటూ నిర్ధారించారు. దీనితో ఈ ఉదయం కూల్చివేత పనులు మొదలయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *