మావోల కొత్తపుంతలు…

మావోల కొత్తపుంతలు…

  • సొంతంగా వాడుతున్న ఇంజనీరింగ్‌ టెక్నాలజీ
  • అడవుల్లో బయల్పడిన మావోల ఆయుధ కర్మాగారం
  • తుమ్రైల్‌-తాలిపేరు నది మధ్య డెన్‌
  • శత్రువు గుర్తించకుండా సొరంగంలో యంత్రాల ఏర్పాటు
  • భారీ మొత్తంలో నక్సల్స్‌ డంప్‌ మెటీరియల్‌ స్వాధీనం

పీపుల్స్‌డైరీ-చర్ల :

మావోయిస్టులు ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ విషయంలో అప్‌డేట్‌ అవుతున్నట్టు స్పష్టమవుతోంది. గతంలో ఆయుధాలను ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితి ఉండేది. కానీ ప్రస్తుతం మావోలే సొంతంగా ఆయుధాలను తయారు చేసుకునే స్థితికి ఎదిగినట్టు అవగతమవుతోంది. నిన్న పోలీసులు అడవుల్లో కనుగొన్న డెన్‌ను బట్టి అనేక చర్చలు పోలీసు వర్గాల్లో జరుగుతున్నాయి. సుక్మా-బీజాపూర్‌ సరిహద్దులో ఎన్‌కౌంటర్‌ తర్వాత, ఆ ప్రాంతాన్ని డిఆర్‌జి బలగాలు పరిశోధించగా మావోయిస్టులు ఏర్పాటు చేసుకున్న భారీ సొరంగాన్ని కనుగొన్నారు. విద్యుత్‌ తీగలు, భారీ యంత్రం, నూతన టెక్నాలజీని ఉపయోగించేలా ఇంజనీరింగ్‌ పరికరాలు లభ్యం కావడంతో పోలీసులు విస్తుపోయారు. సుక్మా`బీజాపూర్‌ సరిహద్దు ప్రాంతంలో ఉన్న తుమ్రైల్‌ ` తాల్పేరు నది మధ్య మావోయిస్టు డంప్‌ను డీఆర్‌జీ సుక్మా సైనికులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టులు ఆయుధాలు, పేలుడు పదార్థాల తయారీకి అవసరమైన సామాగ్రిని సొరంగంలో నిర్మించుకున్నారు. మావోయిస్టులే సొంతంగా కొత్త టెక్నాలజీని అవలంభించడం ద్వారా సైనికులకు హానీ చేయాలని ప్లాన్‌లో ఉన్నట్టు స్పష్టమవుతోంది. బాంబుల తయారీకి ఉపయోగించే గాజు సీసాలు, సొరంగం నుంచి ఆయుధాల తయారీ యంత్రం, ఎలక్ట్రిక్‌ వైర్‌, బాటిల్‌ బాంబు, భారీ మొత్తంలో నక్సల్స్‌ డంప్‌ మెటీరియల్‌ స్వాధీనం చేసుకున్నారు. గతంలో బాంబుల తయారీని మావోలే సొంతంగా తయారుచేసుకున్నప్పటికీ ప్రస్తుతం మారణాయులు కూడా వారే సొంతంగా తయారు చేసుకుంటున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం పోలీసు వర్గాల నక్సల్స్‌ కార్యకలాపాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న క్రమంలో ఇతర ప్రాంతాల నుంచి ఆయుధాల దిగుమతి ప్రక్రియ కష్టంగా మారినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో తామే ఆయుధాల తయారీ చేసుకోవాలని నక్సల్స్‌ భావిస్తున్నట్టు సమాచారం. అయితే ఇలాంటి డెన్‌ కేవలం ఇక్కడ మాత్రమే ఉందా? ఇతర అనేక ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేసుకున్నారా? అని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులను ధీటుగా ఎదుర్కొనేందుకు నక్సల్స్‌ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. గతంలో కూడా పోలీసుల కంటపడకుండా ఉండేందుకు రక్షణ కోసం భారీ సొరంగ మార్గాలు అడవుల్లో బయటపడిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *