విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి
– విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ప్రజా ప్రభుత్వం కృషి
– ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
– విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి
– గణపురం మోడల్ స్కూల్, కళాశాల, బీసీ బాలికల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ
– బీసీ బాలికల వసతి గృహంలో విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే
– మోడల్ స్కూల్, బీసీ బాలికల వసతి గృహాల్లో ఆహార పదార్థాలను పరిశీలన
– విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఆలస్యంగా పెట్టడంతో ఎమ్మెల్యే ఆగ్రహం
గణపురం, ఆగస్టు 24 (పీపుల్స్ డైరీ): విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఆహారాన్ని అందించాలని, విద్యార్థుల బంగారు భవిష్యత్తు కొరకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ప్రభుత్వ మోడల్ స్కూల్, కళాశాల, బీసీ బాలికల వసతి గృహాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ప్రభుత్వ మోడల్ స్కూల్, కళాశాలకు ఎమ్మెల్యే చేరుకున్నారు. అక్కడ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్లో మంచినీటి కొరకు ఒక ఆర్వో ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ కావాలని విద్యార్థులు అడగ్గా, వెంటనే సదరు గుత్తేదారుతో ఫోన్ లో మాట్లాడి వెంటనే ఏర్పాటు చేయాలని సూచించారు. అదేవిధంగా, వర్షానికి గ్రౌండ్లో నీరు నిలుస్తుందని, హాస్టల్లో ఫ్లోరింగ్ దెబ్బతిన్నదని విద్యార్థులు ఎమ్మెల్యేకు తెలిపారు. దీంతో, ఎమ్మెల్యే ఈడబ్ల్యూఐడిసి ఏఈ కి ఫోన్ చేసి అవసరమైన ఎస్టిమేషన్లను రేపటికల్లా తయారుచేసి వెంటనే పనులను ప్రారంభించాలని సూచించారు. కస్తూర్బా గాంధీ ఇంటర్మీడియట్ బిల్డింగ్ శిథిలావస్థలో ఉందని, కొత్త భవనం కావాలని ఉపాధ్యాయులు ఎమ్మెల్యేలను కోరారు. అనంతరం చికెన్ ఇతర సరుకులను ఆలస్యంగా సప్లై చేసిన సదరు కాంట్రాక్టర్ పై చర్యలు ఉంటాయని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి హాస్టల్లో సౌకర్యాలు, అల్పాహారం, భోజన సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బీసీ బాలికల వసతి గృహం వరకు ఎమ్మెల్యే నడుచుకుంటూ వెళ్లారు. అక్కడ వంటశాలలో వండుతున్న ఆహార పదార్థాలను ఎమ్మెల్యే పరిశీలించి, వంటలను రుచి చూశారు. అనంతరం అక్కడ ఎమ్మెల్యే విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈరోజు విద్యార్థులకు వడ్డించే బగారా రైస్ లో కొన్ని పదార్థాలు కలపకపోవడంతో ఎమ్మెల్యే వార్డెన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు టెక్స్ట్ బుక్స్, ఆల్ ఇన్ వన్ పుస్తకాలు కావాలని ఎమ్మెల్యేను అడిగారు. వెంటనే సంబంధిత అధికారులకు ఆ సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని వసతి గృహాల్లో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు భోజనాన్ని అందించేందుకు కృషి చేస్తుందని తెలిపారు. అందులో భాగంగానే విద్యార్థులకు మెస్ చార్జీలతో పాటు కాస్మోటిక్ ఛార్జీలను కూడా పెంచినట్లు ఎమ్మెల్యే గుర్తుచేశారు. విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగి సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలని సూచించారు.
– ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ
గణపురం మండల పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్) ను స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎమ్మెల్యేకు వైద్యాధికారిణి డాక్టర్ అనూష స్వాగతం పలికారు. ఎమ్మెల్యే హాస్పిటల్ లోని వివిధ విభాగాలను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మరింత చేరువగా నాణ్యమైన సేవలు అందించడానికి ప్రభుత్వం అందించే ఆరోగ్య సేవలను, మాత, శిశు సంరక్షణ సేవలు, కుటుంబ నియంత్రణ, సాధారణ ప్రసవాల పట్ల అవగాహన పెంచుతూ, ఆసుపత్రిలో సాధారణ ప్రసవాలను పెంచాలని వైద్యాధికారిణిని ఎమ్మెల్యే ఆదేశించారు. ఆసుపత్రికి ప్రతిరోజు రోగులు ఎంతమంది వస్తున్నారని ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో పెండింగ్ లో ఉన్న పనులను వైద్యాధికారిని ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోగా, పెండింగ్ పనులకు సంబంధించి ఎస్టిమేట్స్ ను తయారు చేసుకుని రావాలని సంబంధిత శాఖ డీఈని ఎమ్మెల్యే ఫోన్లో కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రేపాక రాజేందర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కటుకూరి శ్రీనివాస్, నాయకులు మూటపోతుల శివశంకర్ గౌడ్, చోటే మియా, దూడపాక శంకర్, ఓరుగంటి కృష్ణ, పోశాల మహేష్ తదితరులు పాల్గొన్నారు.
