జిల్లా కేంద్రంలో ఫోటో భవన్ ఏర్పాటుకు సహకరిస్తా
– ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

గణపురం, ఆగస్టు 25 (పీపుల్స్ డైరీ): భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ కొరకు ఫోటో భవన్ ఏర్పాటుకు సహకరిస్తానని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. సోమవారం మండలంలోని చెల్పూర్ గ్రామంలోని లక్కం జయచంద్ర గార్డెన్స్ లో జరిగిన భూపాలపల్లి జిల్లా ఫోటోగ్రాఫర్స్ మరియు వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. ముందుగా ఎమ్మెల్యేకు పలువురు ఫోటోగ్రాఫర్లు శాలువాలు కప్పి స్వాగతం పలికారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఇటీవల చనిపోయిన పలువురు ఫోటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లకు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. నూతన కార్యవర్గ సభ్యులతో ఎమ్మెల్యే ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… జిల్లాలోని ఫోటోగ్రాఫర్లు మరియు వీడియో గ్రాఫర్ల కొరకు అవసరమైన ఫోటో భవన్ జిల్లా కేంద్రంలో నిర్మించడానికి తన వంతుగా సహకరిస్తానని ఎమ్మెల్యే అన్నారు. ఫోటోగ్రాఫర్ల కుటుంబ సభ్యుల అభివృద్ధి, సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని మండలాల నుండి పెద్ద సంఖ్యలో ఫోటోగ్రాఫర్లు మరియు వీడియో గ్రాఫర్లు పాల్గొన్నారు.