ఫిజిక్స్‌ వాలా జిమ్మిక్స్‌

ఫిజిక్స్‌ వాలా జిమ్మిక్స్‌

  • అంతా ముందస్తు ఒప్పందం ప్రకారం…
  • ఏ ప్రభుత్వం ఉన్నా కొమ్ముకాస్తారు…
  • తమకు అనుకూలంగా యవ్వారం మార్చేసుకుంటారు
  • దీంతో ఫిర్యాదులు అందినా చర్యలు ఉండవు..
  • అక్రమాలు తెలిసినా… అధికారులు స్పందించరు
  • విద్యాసంస్థల అక్రమాలెన్నెన్నో
  • కాలేజీలకు అనుమతులుండవు
  • ఆపై పరిమితికి మించి అడ్మిషన్లు
  • పర్మిషన్‌ ఓ చోట… కాలేజీ మరోచోట
  • ఇంటర్‌ బోర్డు నిబంధనలు భేఖాతరు
  • ఆ విద్యా సంస్థకు డీఐఈవోల వత్తాసు

పీపుల్స్‌డైరీ-హైదరాబాద్‌ : రకరకాల జిమ్మిక్కులతో కాలేజీలను నిర్వహిస్తూ దండిగా దండుకోవడమే ‘ఫిజిక్స్‌ వాలా’ లక్ష్యం… ఎలాంటి అడ్డంకులు ఎదురుకాకుండా ముందస్తుగా అధికార యంత్రాంగంతో చీకటి ఒప్పందాలు కుదుర్చుకుని వారి దందాకు అవాంతరాలు లేకుండా చూసుకుంటారు. ఇంకా చెప్పాలంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వారికి కొమ్ముకాస్తారు… తమ దందా సాఫీగా సాగేందుకు దారులు క్లీయర్‌ చేసుకుంటారు. ఇదంతా నగరంలోని ‘ఫిజిక్స్‌ వాలా’ కార్పొరేట్‌ కాలేజీల లీలల్లో భాగమే. కళాశాలల నిర్వహణకు సరైన అనుమతులు ఉండవు… అడ్మిషన్లు మాత్రం ఇబ్బడిముబ్బడిగా తీసుకుంటారనే విమర్శలు మూటగట్టుకుంటారు. భారీ భవంతులు చూపించి అందులోనే తరగతులంటూ ఆకర్షిస్తారు. ఇక వీరికి రాష్ట్ర వ్యాప్తంగా ఏజెంట్లు…. వారి కాలేజీల్లో చేర్పిస్తే ఒక్కో స్టూడెంట్‌కు 20 వేల వరకూ కమీషన్లు ముట్టజెప్పుతారు. ఒక్కో ఏజెంటు కనీసం అయిదారు లక్షలు నుంచి పది లక్షలు జేబులో వేసుకుంటారంటే కార్పొరేట్‌ పడగ ఎంత వ్యాపించిందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఐఐటి, జేఈఈ, నీట్‌ ర్యాంకులు తమ కాలేజీల్లో చేరితేనే వస్తాయని నమ్మ బలుకుతారు… లేని, రాని ర్యాంకులు తమవేనని మభ్యపెడతారు… ఫిజిక్స్‌ వాలాలో కోచింగ్‌ తీసుకున్న వాళ్లకి ర్యాంకులు వచ్చాయి అంటూ లక్షల్లో గుంజుతారు… బోర్డు అధికారులు వీరికి చుట్టాలుగా మారిపోతుంటారు… ఫిజిక్స్‌ వాలా యాజమాన్యం మరింత రెచ్చిపోయి ఎలాంటి అనుమతులు లేకుండా హైదరాబాద్‌ మాదాపూర్‌లో ఎక్కడ పడితే అక్కడ ఫిజిక్స్‌ వాలా కాలేజీ ప్రారంభించింది. వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని ముకుతాడు వేయకపోతే భవిష్యత్తులో వీరి అక్రమ ఆగడాలు మరింత జోరందుకునే అవకాశం ఉంది.
ఫిజిక్స్‌ వాలా విద్యా సంస్థలు నిర్వహిస్తున్న కళాశాలలు అనుమతి లేనివేనని తెలుస్తోంది. ఒక కళాశాలలో విద్యార్థులకు ప్రవేశాలు కచ్పించి మరో కళాశాల ద్వారా వారితో పరీక్షలు రాయిస్తున్నట్లు తెలంగాణ ఇంటర్‌ విద్యా మండలి గత సంవత్సరం జరిపిన తనిఖీలో తనిఖీల్లో వెల్లడైనట్టు తెలిసింది. సంబంధిత కళాశాల యాజమాన్యాలపై చర్యలు తీసుకునేందుకు ఇంటర్‌ బోర్డు సిద్దం కావడంతో యాజమాన్యాలు తమకున్న పలుకుబడిని ఉపయోగించి చర్యల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. విచ్చలవిడిగా రంగారెడ్డి జిల్లా మాదాపూర్‌లో వెలుస్తున్న ఫిజిక్స్‌ వాలా విద్యా సంస్థ జూనియర్‌ కళాశాలల ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు పొందకుండానే యథేచ్ఛగా ప్రవేశాలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇంటర్‌ బోర్డు అడ్మిషన్ల నోటిఫికేషన్‌ ప్రకటించక ముందే ఈ విద్యాసంస్థ యాజమాన్యం పెద్ద ఎత్తున విద్యార్థులను చేర్చుకున్నారు. ఈ వ్యవహారాలన్నీ చెక్కబెట్టేందుకు కొంతమంది ఏజెంట్లను నియమించుకొని ఫిజిక్స్‌ వాలా ఏజెంట్ల ద్వారా తతంగమంతా నడిపిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. కొత్త జూనియర్‌ కళాశాలకు అనుమతులు ఇవ్వడాన్ని నిషేధించినా ఈ ఫిజిక్స్‌ వాలా యజమాన్యం ప్రభుత్వ పెద్దలతో మాట్లాడుకుని నడిపిస్తున్నారని ప్రచారం జరుగుతుంది.
– ర్యాంకులు రాకున్నా వచ్చినట్టు ప్రచారం
తమకు రాని ర్యాంకులకు తమ ర్యాంకులుగా చెప్పుకుని విద్యార్ధులను మభ్యపెడుతున్నట్లు ప్రచారం జరుగుతోందని. తప్పుడు, ఆకర్షణీయమైన ప్రకటనలను చూసి విద్యార్థులు ఈ విద్యాసంస్థ వలలో చిక్కుకుని ప్రవేశాలు పొందుతున్నట్లు సమాచారం. ఇంటర్‌ బోర్డు అనుమతులు పొందిన కొన్ని అన్‌ ఎయిడెడ్‌, ప్రయివేటు జూనియర్‌ కళాశాలల యాజమాన్యాలతో ఒప్పందం కుదుర్చుకుని ఆ కళాశాలల ద్వారా విద్యార్థులను పరీక్షలకు పంపిస్తున్నట్లు సమాచారం. ఇందుకు ఆ కళాశాల యాజమాన్యానికి ఒక్కో అడ్మిషనుకు రూ.20 వేల నుంచి రూ.30 వేలు చెల్లిస్తున్నట్టు చెబుతున్నారు. ఇంటర్‌తో పాటు ఐఐటి, నీట్‌ కోచింగ్‌ ఇస్తామని నమ్మబలుకుతున్న ఈ కళాశాల యాజమాన్యం ఇందుకోసం విద్యార్థుల నుంచి లక్షల రూపాయల ఫీజులను దండుకుంటున్నట్టు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఆ ప్రభుత్వ పెద్దలకు కొమ్మకాయడం ఈ కళాశాల యాజమాన్యానికి అలవాటుగా మారింది. కళాశాలల్లో అనుమతులు మంజూరైన సెక్షన్లకు రెట్టింపుగా ప్రవేశాలు జరుపుతున్నట్టు కూడా ఇంటర్‌ బోర్డుకు ఫిర్యాదులు వచ్చినా ఫలితం లేకుండా పోతోంది. ఈ కార్పోరేట్‌ కళాశాలను నియంత్రించి జరుగుతున్న అక్రమాలపై చర్యలు తీసుకోవాల్సిన జిల్లా ఇంటర్‌ బోర్డు అధికారులు (డీఐఈవో) యాజమాన్యంతో చేతులు కలిపి వారిచ్చే అమ్యామ్యాలు తీసుకుని.. చేసిన అక్రమాలకు ఆమోదం తెలుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఫిజిక్స్‌ వాలా యాజమాన్యం రెచ్చిపోయి యథేచ్చగా అక్రమాలకు పాల్పడుతున్నట్టు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *