కాంగ్రెస్ రాజకీయ మాయాజాలం… బీసీలతో దోపిడీ ఆటలు…

కాంగ్రెస్ రాజకీయ మాయాజాలం… బీసీలతో దోపిడీ ఆటలు…

– 6 గ్యారంటీలు, 420 హామీల ముసుగు
– యూరియా కొరతతో రైతులపై దాడి
– ఓటమి భయంతో స్థానిక ఎన్నికల వాయిదా
– బీసీ రిజర్వేషన్ పేరుతో కోర్టు తీర్పు ఎగబాటు
– చట్టబద్ధత లేని జీవోతో షెడ్యూల్ డ్రామా
– బీసీలను బలి పశువులుగా మలిచిన సీఎం
– బిజెపి అనుకూల వాదనలతో రిజర్వేషన్ సమర్థన
– 42% రిజర్వేషన్ ఇవ్వకపోతే తిరుగుబాటు
– బీజేవైఎం కళాశాలాల విభాగం రాష్ట్ర కన్వీనర్ మంద మహేష్

 

గణపురం, అక్టోబర్ 12 (పీపుల్స్ డైరీ): 6 గ్యారంటీలు, 420 హామీలతో ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొన్న పరిస్థితుల్లో, ఓటమి భయంతోనే స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని బీజేవైఎం కళాశాలాల విభాగం రాష్ట్ర కన్వీనర్ మంద మహేష్ ఆరోపించారు.

ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా యూరియా కొరతతో రైతులను ఇబ్బంది పెట్టిన తీరుపై ప్రజల్లో ఆగ్రహావేశాలు ఉప్పొంగుతున్నాయని చెప్పారు. సెప్టెంబర్ 30లోపు స్థానిక ఎన్నికలు జరపాలని హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ, ఓటమి భయంతో ముఖ్యమంత్రి కోర్టు తీర్పును ఎగబాటి, బీసీ రిజర్వేషన్ల పేరుతో ఎన్నికలను ఆపే మార్గంలో నడిచారని మండిపడ్డారు.

బీసీ రిజర్వేషన్ల హామీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని, అమలు చేయాల్సింది కూడా కాంగ్రెస్ పార్టీయేనని, కానీ చట్టాలకు విరుద్ధంగా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వెళ్లి బాధ్యత బిజెపిపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని మహేష్ విమర్శించారు. చట్టబద్ధత లేని జీవో ద్వారా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసి బీసీలను బలి పశువులుగా మలిచారంటూ రేవంత్ రెడ్డి రాజకీయ మాయాజాలాన్ని ఎండగట్టారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంలో బిజెపికి ఎలాంటి అభ్యంతరం లేదని, అందుకే రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య హైకోర్టులో బీసీ రిజర్వేషన్ కేసులో అనుకూల వాదనలు వినిపించారని తెలిపారు.

తమ రాజకీయ స్వలాభం కోసం బీసీల మనోభావాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆటలాడుకుంటే సహించబోమని హెచ్చరిస్తూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుంటే బీసీల తిరుగుబాటు తప్పదని మంద మహేష్ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *