రెచ్చిపోయిన ఉగ్రవాదులు
- భారత సైనిక వాహనంపై దాడి
- సమర్ధవంతంగా తిప్పికొట్టిన సైన్యం
- ముష్కరుల కోసం ముమ్మరంగా గాలింపు
పీపుల్స్‌డైరీ`న్యూఢల్లీి : జమ్మూ కశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. సైనిక వాహనమే లక్ష్యంగా కాల్పులు జరిపారు. అఖ్నూర్ సమీపంలో సైనిక వాహనంపై పలు రౌండ్ల పాటు కాల్పులు జరపడంతో సైన్యం అప్రమత్తమయ్యింది. ఘటన గురించి సమాచారం అందుకున్న భద్రతా బలగాలు అక్కడకు చేరుకుని తనిఖీలు చేపట్టాయి. సైన్యం రాకతో ఉగ్రవాదులు అక్కడ నుంచి పరారైనట్టు తెలుస్తోంది. చుట్టుపక్కల ముష్కరుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. అఖ్నూర్ ఉగ్రదాడిపై ఆర్మీకి చెందిన వెట్ నైట్ కార్ప్స్ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘అఖ్నూరు సుందర్‌బని సెక్టార్‌లోని అసన్ సమీపంలో సైనిక కాన్వాయ్‌పై సోమవారం ఉదయం ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.. ఈ దాడిని సమర్ధంగా తిప్పికొట్టిన సైన్యం ఎదురుకాల్పులు జరిపింది.. ఘటనలో సైనికులు ఎవరూ గాయపడలేదు.. ఆ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాల ఆపరేషన్ కొనసాగుతోంది.. చుట్టుపక్కల ముమ్మరంగా గాలిస్తున్నారు ’ అని ప్రకటనలో పేర్కొంది. కాగా, ఈ ఘటన గురించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. ఇటీవల ఉగ్రవాదుల వరుస దాడులు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే ఉగ్రవాదుల దాడుల్లో ఇద్దరు సైనికులు సహా 11 మంది ప్రాణాలు కోల్పోయారు.