హైదరాబాద్ సీపీ కీలక నిర్ణయం
- నగరంలో 144 సెక్షన్
- నెల రోజుల పాటు అమలు
పీపుల్స్‌డైరీ`హైదరాబాద్ : శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ పరిధిలో నెల రోజుల పాటు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని చెప్పారు. నగరంలో ఎటువంటి సమావేశాలు, ధర్నాలు, నిరసనలు, ర్యాలీలు, ఆందోళనకు అనుమతి లేదని చెప్పారు. పోలీసుల ఆదేశాలు పాటించకుండా, అనుమతి లేకుండా సమావేశాలు, ధర్నాలు, నిరసనలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రజలు సహకరించాలని కోరారు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ స్పెషల్ పోలీసులు, వారి కుటుంబ సభ్యులు ఆందోళనలు చేపడుతున్నారు. ఓకే రాష్ట్రం-ఒకే పోలీసింగ్ విధానం అమలు చేయాలంటూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ స్పెషల్ పోలీసులు ఆందోళనలు ఉద్ధృతం చేసే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దానికి తోడు జన్వాడ పార్టీ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఓ ముఖ్య నేత బంధువులకు చెందిన ఫాంహౌస్‌లో భారీగా విదేశీ మద్యం పట్టుబటం కలకలం రేపుతోంది. ఇప్పటికే పలువురు వ్యక్తులపై కేసులు నమోదు కాగా.. ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అది రేవ్ పార్టీ కాదని.. కుటుంబ సభ్యులతో చేసుకుంటున్న దావత్ అని చెబుతున్నారు. ప్రభుత్వం కావాలనే తప్పుడు కేసులు పెడుతుందని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ శ్రేణులు నేడు నిరసనలకు పిలుపునిచ్చే ప్రమాదం ఉండటంతో పోలీసు శాఖ అప్రమత్తమైంది. ఈ వ్యవహారాలను దృష్టిలో ఉంచుకొని నగరంలో నెల రోజుల పాటు 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు సీపీ సీవీ ఆనంద్ ప్రకటించారు.