నిజామాబాద్‌ నగరానికి మహర్ధశ

నిజామాబాద్‌ నగరానికి మహర్ధశ

  • నగరం గుండా 4 లేన్‌ హైవే
  • ఇక ట్రాఫిక్‌ సమస్యకు చెక్‌

పీపుల్స్‌డైరీ`నిజామాబాద్‌ : నిజామాబాద్‌ రూపు రేఖలు మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. జిల్లా కేంద్రంలో రోడ్లు అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకుంటున్న రేవంత్‌ సర్కార్‌.. నాలుగు వరసల రోడ్డు నిర్మాణానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. పట్టణంలోని వినాయక్‌నగర్‌ హనుమాన్‌ కూడలి నుంచి బస్వాగార్డెన్‌ మీదుగా దేవి థియేటర్‌ వైపునకు వెళ్లే బ్రిడ్జి వరకు కొత్త రహదారి నిర్మించనున్నారు. నాలుగు వరసలుగా ఈ రహదారి నిర్మించేందుకు రోడ్లు, భవనాల శాఖ ప్రణాళికలు రూపొందించింది. ఈ రహదారి నిర్మాణం కోసం రూ.7.80 కోట్ల నిధులు సైతం మంజారు చేశారు. కాగా.. ప్రస్తుతం టెండరు ప్రక్రియ ముగిసింది. వినాయక్‌నగర్‌ నుంచి బస్వా గార్డెన్‌ మీదుగా దేవి థియేటర్‌ వైపునకు వెళ్లే రోడ్డు ప్రస్తుతం చాలా ఇరుకుగా ఉంది. సుమారు ఈ రోడ్డు 1.50 కి.మీ. ఉండగా.. వాహనాల రద్దీతో ఎప్పుడూ కిక్కిరిసి ఉంటుంది. ఇక ఉదయం, సాయంత్రం వేళల్లో అయితే రద్దీ మరింత ఎక్కువగా కనిపిస్తోంది. స్కూల్‌ సమయంలో బస్సులు, బైకులు ఒక్కసారిగా రోడ్లుపైకి రావడంతో వాహనరాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. బస్వా గార్డెన్‌ దాటిన తర్వాత ఉన్న టర్నింగ్‌లు సైతం చాలా ప్రమాదకరంగా తయారయ్యాయి. రెండు వైపులా వాహనాలు ఒకేసారి రోడ్లపైకి రావడంతో తరచుగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఇక్కడ రోడ్డు నిర్మాణానికి ప్రాతిపాదనలు వచ్చాయి. అత్యంత రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో 4 లైన్‌ హైవే విస్తరిస్తే ట్రాఫిక్‌ కష్టాలు దూరమవుతాయని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు ప్రతిపాదనలు పంపగా.. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. త్వరలోనే రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయని ఆర్‌అండ్‌బీ నిజామాబాద్‌ డీఈ ప్రవీణ్‌ వెల్లడిరచారు. రహదారి అందుబాటులోకి వస్తే పట్టణ ప్రజల కష్టాలు తీరిపోతాయని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *