- ఆ రూట్‌లో తీరనున్న ట్రాఫిక్ కష్టాలు
- హైదరాబాద్‌లో 6 వరుసల రహదారి
హైదరాబాద్ విశ్వనగరంగా వేగంగా అభివృద్ది చెందుతోంది. నగరం నలుమూలలా విస్తరిస్తోంది. నగర జనాభా ఇప్పటికే కోటి దాటింది. అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు నగరంలో పెట్టుబడులు పెట్టగా.. మరికొన్ని సంస్థలు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ మేరకు నగరంలో మౌళిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వాలు ఫోకస్ పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో కీలక మార్గాల్లో ఒకటైన గండిమైసమ్మ-మియాపూర్ రోడ్డు విస్తరణ పనులు తాజాగా ప్రారంభమయ్యాయి. దాదాపు రూ.135 కోట్ల నిధులతో ఈ పనులు చేపట్టారు. ప్రస్తుతం 4 వరుసలుగా ఉన్న ఈ రహదారిని ఆరు వరుసలుగా విస్తరించనున్నారు. 14 కి.మీ రోడ్డు విస్తరణ జరగనుండగా.. వచ్చే ఏడాది నవంబర్ లోగా.. వాహనదారులకు అందుబాటులోకి తీసుకొచ్చేలా హెచ్‌ఎండీఏ టార్గెట్‌గా పెట్టుకుంది. ఈ రహదారి పూర్తయితే మల్లంపేట్ వద్ద నిర్మించిన ట్రంప్‌లెట్ నుంచి ఔటర్ రింగు రోడ్డుకు ఈజీగా చేరుకోవచ్చు. అలాగే గండిమైసమ్మ నుంచి ఔటర్ రింగు రోడ్డు వైపు వెళ్లేందుకు కూడా కీలక మార్గం కానుంది. నాగ్‌పూర్ నేషనల్ హైవే 65తో ఈ రహదారికి లింకు ఏర్పడుతుంది. మియాపూర్- గండిమైసమ్మ రహదారిపై ప్రతి నిత్యం ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ఉదయం 9 నుంచి 11 వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 వరకు విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది. 4 వరుసలుగా రహదారి ఉండటంతో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో రోడ్డును ఆరు వరుసలుగా విస్తరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే.. దాదాపు 20 లక్షలమందికి ప్రయోజనం కలుగుతుందని హెచ్‌ఎండీఏ అధికారులు అంచనా వేస్తున్నారు.