సర్వే నమోదుకు సొంతూరుకు వెళ్తున్నారా..?

క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం

పీపుల్స్‌డైరీ`హైదరాబాద్‌ : తెలంగాణ ప్రభుత్వం ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా సర్వే కోసం పూనుకున్న విషయం తెలిసిందే. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమాచార సేకరణకు సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కొనసాగిస్తున్నది. ఈనెల 6న సర్వే ప్రారంభం కాగా.. 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా సర్వే జరుపనున్నారు. రాష్ట్రంలో మొత్తం 1,17,44,954 కుటుంబాలు ఉన్నాయని ప్రభుత్వం యంత్రాంగం ద్వారా గుర్తించింది. గ్రామాల్లో స్టిక్కరింగ్‌ పూర్తి కాగా.. పట్టణాలు, నగరాల్లో అక్కడక్కడా కొన్ని ఇండ్లు మిగిలాయి. వాటి వివరాల నమోదు నేటితో పూర్తి చేయనున్నారు. ఇక స్టిక్కరింగ్‌ అయిపోవటంతో రెండోదశగా సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభం కానుంది. కుటుంబ వ్యక్తిగత వివరాలను ఎన్యూమరేటర్లు సేకరిస్తారు. ప్రతి ఇంటికీ వెళ్లి ప్రతి కుటుంబంలోని సభ్యులందరి సమగ్ర వివరాలను నమోదు చేస్తారు. అయితే వృత్తి, వ్యాపారం, ఉద్యోగాల కోసం స్వగ్రామంలోని ఇల్లు వదిలి చాలా మంది దూరప్రాంతాల్లోని పట్టణాలు, నగరాల్లో ఉంటున్నారు. ఆధార్‌ కార్డులో అడ్రస్‌ ఉన్న చోటికి, సొంతింటికి, స్వగ్రామానికి వెళితేనే కుటుంబ వివరాలు నమోదు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. దీంతో చాలా మంది సొంతూళ్లకు పయనమయ్యారు. మరికొందరు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలో అలాంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఒక కుటుంబం ప్రస్తుతం ఎక్కడ నివసిస్తుంటే అక్కడే ఎన్యుమరేటర్ల వద్ద తమ వివరాలను నమోదు చేయించుకునే అవకాశమిచ్చింది. స్వగ్రామం, సొంతిటికి వెళ్లాల్సిన పని లేదని చెప్పారు. ఉన్నచోట వివరాలు చెబితే సరిపోతుందని వెల్లడిరచారు. కుటుంబ సభ్యుల ఆధార్‌, మ్నెబైల్‌ నంబర్లు, ప్రశ్నపత్రంలో అడిగిన వివరాలన్నీ తెలపాలన్నారు. ఆధార్‌, రేషన్‌కార్డు, ధరణి పాసుపుస్తకం, బ్యాంకు అకౌంట్‌ పాస్‌ పుస్తకం వంటివి అందుబాటులో ఉంచుకుంటే ఈజీగా ఉంటుందని చెబుతున్నారు. సర్వే కోసం వచ్చిన ఎన్యుమరేటర్లకు త్వరగా సమాచారం ఇవ్వవచ్చునని అధికారులు వెల్లడిరచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *