Happy New Year 2025: శుభాకాంక్షల పేరుతో లింక్‌లు వస్తున్నాయా.. అయితే మీరు డేంజర్‌లో పడ్డట్లే..
కొన్ని గంటల్లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ సందర్భంగా ప్రపంచం మొత్తం న్యూ ఇయర్ వేడుకల్లో మునిగిపోయింది. యువతీయువకులు అర్ధరాత్రి వరకూ కేక్ కటింగ్‌లు, డీజేలు, డాన్సులతో బిజీబిజీగా గడుపుతున్నారు. అయితే మరోవైపు.. ఇదే అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు సైబర్ నేరగాళ్లు కాసుక్కూర్చున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా వినూత్న పద్ధతిలో శుభాకాంక్షలు పంపుతూ నేరాలకు పాల్పడుతున్నారు. మీ ఫోన్‌లో న్యూ ఇయర్ పేరుతో అనేక రకాల లింక్‌లు వస్తున్నాయా. పొరపాటున వాటిపై క్లిక్ చేశారంటే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అయినట్లే..
కొత్త సంవత్సర వేడుకల (Happy New Year 2025) మాటున సైబర్ నేరగాళ్లు సరికొత్త నేరాలకు తెరలేపుతున్నారు. సాధారణంగా కొత్త సంవత్సరం అనగానే ప్రతి ఒక్కరూ తమ బంధువులు, స్నేహితులు, సన్నిహితులకు శుభాకాంక్షలు చెబుతుంటారు. ఇక్కడే చాలా మంది సైబర్ నేరగాళ్లకు దొరికిపోయేందుకు అవకాశం ఉంటుంది. వినూత్న పద్ధతిలో శుభాకాంక్షలు రెడీ చేసుకోవచ్చని చెబుతూ కొత్త కొత్త నంబర్ల నుంచి లింక్‌లు పంపుతారు.
అలాంటి లింక్‌లపై క్లిక్ చేస్తే.. ఆ వెంటనే మీ సమాచారం మొత్తం నేరగాళ్ల చేతిలోకి వెళ్లిపోతుంది. తద్వారా మీ బ్యాంక్ వివరాలతో పాటూ ఫోన్‌లోని ఫొటోలు, వీడియోలు, నంబర్లు ఇలా మొత్తం తీసుకుంటారు. ఇలా చివరకు మీ బ్యాంక్ ఖాతాలోని నగదును చోరీ చేసే ప్రమాదం కూడా ఉంటుంది. కొందరికి ప్యాకేజీల పేరుతో ఏపీకే ఫైల్స్ వస్తుంటాయి. వాటిపై క్లిక్ చేసినా చివరకు డేంజర్‌లో పడతారు.
ఇంకొందరికి తక్కువ రేట్లకే న్యూఇయర్ ఈవెంట్ పాస్‌లు అంటూ లింక్‌లు వస్తుంటాయి. ఇలాంటి లింక్‌లపై క్లిక్ చేయడం గానీ, ఇతరులకు పంపడం గానీ చేయడకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎలాంటి డిస్కౌంట్ లింక్‌లనూ నమ్మవద్దని, ఒకటికి పదిసార్లు చెక్ చేసుకోవాలని.. లేదంటే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని సూచిస్తున్నారు.