ప్రిన్సిపల్ ఝాన్సీ రాణి పాఠశాల అభివృద్ధికి విశేష కృషి చేశారు
– భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
భూపాలపల్లి, ఏప్రిల్ 23 (పీపుల్స్ డైరీ):

సింగరేణి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చండ్ర ఝాన్సీ రాణి వెంకటేశ్వర్లు పాఠశాల అభివృద్ధికి విశేష కృషి చేశారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కృష్ణ కాలనీలో గల సింగరేణి ఉన్నత పాఠశాలలో ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చండ్ర ఝాన్సీ రాణి ఉద్యోగ విరమణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయుల బృందం, బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు ప్రిన్సిపాల్ ఝాన్సీరాణినీ పుష్పగుచ్చాలు అందజేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ హాజరై
ప్రిన్సిపాల్ ఝాన్సీ రాణి వెంకటేశ్వర్లుకు పుష్పగుచ్చం అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రిన్సిపల్ ఝాన్సీ రాణి విద్యను అందించడంలో ఆమె కృషి, పట్టుదల, ధైర్యంను కొనియాడారు. సింగరేణి యాజమాన్యం సిఎస్ఆర్ నిధులను ఈ ప్రాంతం అభివృద్ధికి ఉపయోగించాలని సూచించారు. పాఠశాల సమస్యల సాధనలో ఎంతో పట్టుదలను కనబరిచి విద్యార్థుల ప్రగతికి ప్రతినిత్యం పాటుపడ్డారన్నారు. అనంతరం సన్మాన గ్రహీత మాట్లాడుతూ పాఠశాల అంటే సమాజ ప్రతిబింబాన్ని చూపుతుందనీ, పాఠశాల బాగుంటేనే సమాజం బాగుంటుందనే నమ్మకంతో పాఠశాల అభివృద్ధికి తన 42 సంవత్సరాల ఉద్యోగ బాధ్యతను ఎంతో నిబద్ధత విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి, పాఠశాల మౌలిక సదుపాయాల అభివృద్ధికి పదో తరగతి విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించటానికి ఎంతో కృషి చేశామన్నారు. తను నివసిస్తున్న తన చుట్టూ ఉన్న సమాజం బాగు కోసం కూడా తను ఆలోచిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, పాఠశాల ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్ ఝాన్సీ రాణి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, తదితరులు పాల్గొన్నారు