సెకండ్ ఫేజ్ మెట్రో… నెక్ట్స్ లెవల్
- ఫోర్త్ జనరేషన్ కోచ్‌లు ఉపయోగించే ఆలోచన
- ఇప్పటికంటే మరింత అధునాతనంగా సేవలు
- పార్కింగ్ సమస్యలకు చెక్
పీపుల్స్‌డైరీ`హైదరాబాద్ : మెట్రో రైల్ అభివృద్ధికి, మెట్రో రైల్ ప్రాజెక్ట్ రెండో దశ నిర్మాణానికి ఇటీవల తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మెట్రో రెండవ దశ పనులకు కేంద్రం ఓకే చెప్తే త్వరలోనే మొదలు కానున్నాయి. అయితే ఈ సారి మెట్రో రెండో దశ మరింత అధునాతన హంగులతో ఉండబోతుంది అన్నది మాత్రం తాజాగా కేంద్రానికి పంపిన డీపీఆర్ తో అర్ధం అవుతుంది. తొలి దశలో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయడంతో పాటు, రెండవ దశ నిర్మాణానికి ఇటీవల మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలపడంతో మెట్రో రైలు రెండవ దశ విస్తరణకు రాష్ట్రం నుండి గ్రీన్ సిగ్నల్ లభించింది. దీనికి సంబంధించిన డిపిఆర్ ను మంత్రివర్గం ఆమోదించింది. అయితే ఆ డీపీఆర్‌లో మెట్రో సేవలకు సంబంధించిన పలు కీలకఅంశాలు రైల్వేలో మరింత ఆధునిక టెక్నాలజీని, ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించబడ్డాయి. మొత్తం 76.4 కిలోమీటర్ల మేర మెట్రో రైలు నిర్మించాలని ప్రతిపాదనలకు ఆమోదం లభించడంతో నాగోల్ శంషాబాద్, రాయదుర్గం కోకాపేట్, ఎంజీబీఎస్ చాంద్రాయణ గుట్ట, మియాపూర్ పటాన్ చెరు, ఎల్బీనగర్ హయత్ నగర్ మొత్తం 76.4 కిలోమీటర్ల మేరకు మెట్రో రైల్ ప్రాజెక్టు విస్తరణకు రంగం సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్య విధానంలో చేపట్టే మెట్రో రైలు రెండవ దశ ప్రాజెక్టు కోసం మొత్తం 24వేల 249కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు సిద్ధం చేసిన డిపిఆర్ లో మెట్రో సెకండ్ ఫేజ్ లో ప్రయాణికులకు సరికొత్త ప్రయాణ అనుభూతిని కల్గించేలా ప్లాన్ చేశారు. ప్రస్తుతం ఉన్న మెట్రో రైళ్ళలో థర్డ్ జనరేషన్ కోచ్ లు వాడుతుండగా, సెకండ్ ఫేజ్ లో ఫోర్త్ జనరేషన్ కోచ్‌లు ఉపయోగించాలని నిర్ణయించారు. అంతేకాదు ప్రయాణికుల భద్రత కోసం ప్లాట్ ఫాం పైన స్క్రీన్ డోర్స్ కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇక మెట్రో స్టేషన్ల వద్ద పార్కింగ్ ప్రాబ్లమ్స్ ను పరిష్కరించటం కోసం ఎకరం విస్తీర్ణంలో పార్కింగ్ ఏర్పాట్లు చేయటం వంటి వాటిని తాజా డీపీఆర్‌లో ప్రతిపాదించారు. ప్రస్తుతం చాలా మెట్రో స్టేషన్ల వద్ద పార్కింగ్ సమస్యలు ఉన్నాయి. కానీ మెట్రో రెండో దశలో మాత్రం పార్కింగ్ కు ఎలాంటి ఇబ్బంది ఉండదు.