అవినీతి, అక్రమాలపై ’పీపుల్స్ డైరీ‘ నిరంతర యుద్ధం
– అక్షరాలే ఆయుధంగా సమాజ మార్పుకు పత్రిక యాత్ర
– అట్టహాసంగా ’పీపుల్స్ డైరీ‘ 18వ వార్షికోత్సవ వేడుకలు
పీపుల్స్ డైరీ – హనుమకొండ : పేదలు, పీడితుల గొంతుగా మారి వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ‘పీపుల్స్ డైరీ’ దినపత్రిక పనిచేస్తున్నదని ఎడిటర్ కొండపర్తి కిరణ్ అన్నారు. ప్రతి పుటలో, ప్రతి వార్తలో, సామాజిక న్యాయం, ప్రజల హక్కులు, అవినీతి–అక్రమాలపై నిరంతర యుద్ధాన్ని ప్రకటిస్తూ ముందుకు సాగుతుందన్నారు. ’పీపుల్స్ డైరీ దినపత్రిక 18వ వార్షికోత్సవ వేడుకలు హనుమకొండలో ఘనంగా జరుగగా కిరణ్ ముఖ్యఅతిథిగా మాట్లాడారు. కార్యక్రమానికి పత్రిక స్పెషల్ కరస్పాండెంట్ కండె రమేష్ అధ్యక్షత వహించగా కిరణ్ మాట్లాడుతూ పత్రిక పేద ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే వేదికగా పనిచేస్తోందని, అనేక సమస్యలపై గురిపెట్టి వాటి పరిష్కారానికి దిశ చూపడం పత్రిక ప్రధాన లక్ష్యం అన్నారు. ప్రతి కథనం, ప్రతి ఫొటో, ప్రతి అధ్యయనం ప్రజల సమస్యలపై విన్నపంగా, ప్రభుత్వ చర్యలకు ప్రేరణగా మారుతుందన్నారు. అతి తక్కువ కాలంలోనే ‘పీపుల్స్ డైరీ’ తన ప్రత్యేక స్థానాన్ని సంపాదించి, పాఠకుల ఆదరణను పొందింది. ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడం మాత్రమే కాదు, సమాజంలో అవినీతి, అన్యాయం, అక్రమాలకు వ్యతిరేకంగా శక్తివంతమైన ప్రతినిధిగా పత్రిక నిలుస్తోందన్నారు. పత్రికలో పనిచేసే రిపోర్టర్లు, సిబ్బంది సహాయ సహకారాలతో పత్రిక దూసుకెళ్తున్నదని, ఇదే ఒరవడితో అందరం సమిష్టిగా క్రుషిచేస్తూ మరింత పైకి ఎదుగుదామని ఆకాక్షించారు.
’పీపుల్స్ డైరీ‘ స్పెషల్ కరస్పాండెంట్ కండె రమేష్ మాట్లాడుతూ అక్షరాలనే ఆయుధాలుగా మార్చి, సమాజంలో మార్పు తేవడానికి పత్రిక నిత్యం కృషి చేస్తోంది అన్నారు. ఎన్ని అవరోధాలు ఎదురైనా ఈ ఒరవడిని ఇలాగే కొనసాగిద్దామన్నారు. పత్రిక ఎదుగుదలకు రిపోర్టర్లు ఏ విధంగా పక్కా ప్రణాళికతో పనిచేయాలో పలు సూచనలు చేశారు.
సీనియర్ డెస్క్ జర్నలిస్టు శ్రీగాధ నర్సింహారావు మాట్లాడుతూ ‘పీపుల్స్ డైరీ’ పత్రిక అతి తక్కువ కాలంలోనే ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుందన్నారు. ఎంతో మంది ఇతర పత్రికల జర్నలిస్టులు పత్రికను ఆదర్శంగా తీసుకుంటున్నారన్నారు. వార్త రచనలో జర్నలిస్టులకు నర్సింహారావు ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు.
’పీపుల్స్ డైరీ వరంగల్, ఖమ్మం జిల్లాల ప్రతినిధులు కూచన సంతోష్, బండి కుమార్ మాట్లాడుతూ ఎలాంటి ఒత్తిళ్లకు, బెదిరింపులకు భయపడేదేలేదని, అవినీతి పరులు, అక్రమార్కుల గుండెల్లో నిత్యం నిద్రపోతామన్నారు. అణగారిన వర్గాలు, పేదలు, బాధితులు ఎక్కడ సమస్యల్లో చిక్కుకున్నా వారికి అండగా వార్త కథనాలు అందిస్తూ పత్రిక అభివ్రుద్దిలో పాలుపంచుకుంటామన్నారు.
సమావేశంలో వివిధ మండలాల నుంచి హాజరైన జర్నలిస్టులు పత్రిక కోసం వారి వారి అమూల్య సలహాలు, సూచనలు అందించారు. అన్ని మండలాలకు చెందిన విలేకరులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
