ఈసారి ఉగ్ర ఎండలు…

  • 2026 సమ్మర్‌ అలర్ట్‌…
  • ఎల్‌నినో ప్రభావంతో అగ్నిపరీక్షే
  • మే, జూన్‌ నెలల్లో చుక్కలు చూపించనున్న ఎండలు
  • మార్చి, ఏప్రిల్‌ నెలల్లో ఇబ్బందేమీ ఉండదట…

పీపుల్స్‌డైరీ`హైదరాబాద్‌ : 2026 సమ్మర్‌ ప్రజలకు చుక్కలు చూపించనున్నట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో ఎప్పటిలాగే ఉష్ణోగ్రతలు ఉంటాయని, మే నెలలో మాత్రం అనేక చోట్ల 45 డిగ్రీల టెంపరేచర్‌ దాటి నిప్పుల వర్షం కురిపిస్తుందని పేర్కొంటున్నారు. పసిపిక్‌ మహాసముద్రంలో ఏర్పడే ఎల్‌నినో ప్రభావంతో వాతావరణంలో అసాధారణ మార్పులు సంభవించనున్నట్టు తెలుస్తోంది. అయితే ఇక్కడ మరో ఉపశమనకరమైన విషయాన్ని వాతావరణ అధికారులు సూచిస్తున్నారు. అదేంటంటే… మార్చి, ఏప్రిల్‌ నెలల్లో అక్కడక్కడ అకాల వర్షాలు కురుస్తాయని, తద్వారా వాతావరణం చల్లబడుతుందని పేర్కొంటున్నారు. దీనిని బట్టి ఈసారి ఎండాకాలంలో రెండు విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొనున్నట్టు అవగతమవుతోంది. ఎండాకాలంలో సగ భాగం సాధారణ పరిస్థితులు ఉంటే మరో సగ భాగం మాత్రం విపరీతమైన ఎండలతో జనం అల్లాడిపోయేలా పరిస్థితులు గోచరిస్తున్నాయి. వాతావరణంలో చోటు చేసుకుంటున్న ఈ మార్పులకు ‘ఎల్‌ నినో’ ప్రధాన కారణంగా అధికారులు వివరిస్తున్నారు. ఇది సముద్రపు నీటి ఉష్ణోగ్రతను పెంచి, గాలి దిశలను తన ఇష్టానుసారం మార్చేస్తుందట. దీనివల్ల మన దేశానికి వర్షాలను మోసుకొచ్చే నైరుతి రుతుపవనాలు ఈసారి ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంటుందని వివరిస్తున్నారు. దీనిని బట్టి ఈసారి జూన్‌ మొదటి వారంలోనే ప్రారంభం కానున్న వర్షాలు ఆలస్యమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *