పరమశివా… పాహిమాం…
• నల్లబెల్లి, గుండ్లపాహాడ్, మేడపల్లి శైవక్షేత్రాల్లో భక్తుల రద్దీ
• ప్రతిధ్వనించిన శివయ్య నామం
• భక్తులతో పోటెత్తిన ఆలయాలు
• శివ నామస్మరణతో మార్మోగిన ఆలయాలు
• అభిషేకాలు కుంకుమార్చనలు పవిత్ర పూజలు
• ఘనంగా మహాశివరాత్రి ఉత్సవాలు


నల్లబెల్లి – పీపుల్స్ డైరీ
హరహర మహాదేవ.. భోళా శంకర.. జంగమయ్యా.. అంటూ శివ నామస్మరణతో మండలంలోని ఆలయాలు భక్తి పారవశ్యాలతో కళకళలాడాయి. మహాశివరాత్రి పురస్కరించుకొని మండలంలోని ఆలయాలు భక్తజనంతో నిండిపోయాయి. పండుగ సందర్భంగా వేకువ జామునే భక్తులు పెద్ద ఎత్తున దేవదేవుడి దర్శనార్థం ఆలయాల్లో బారులు తీరారు. రోజంతా ఉపవాసం, జాగారం ఉండి శంకరుడిని శరణు వేడారు. ఆలయాల్లో ఈశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. భజనలు, సంకీర్తనలతో ఆలయాలు మారుమోగాయి.మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మండలంలోని నల్లబెల్లి, గుండ్లపాహాడ్, మేడపల్లి,గోవిందాపురం గ్రామాల్లోని శివాలయాలు ఆదివారం శివనామస్మరణతో మార్మోగాయి. ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలతో పాటు మహా రుద్రాభి షేకం చేశారు. మండల వ్యాప్తంగా ప్రజలు, శివభక్తుల జాగరణ, ఉపావాస దీక్షల సందర్భంగా మండలంలోని శివాలయాల్లో రాత్రివేళ సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించి లింగోద్భవ పూజలను ఘనంగా నిర్వహించడంతో మహా శివరాత్రి వేడుకలను భక్తులు ఘనంగా జరుపుకున్నారు. మండలంలో ప్రసిద్ధి గాంచిన గుండ్లపహాడ్ శ్రీ రాజరాజేశ్వర స్వామి శివాలయంలో భక్తులు వందల సంఖ్యలో చేరుకొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రాత్రి వేళల్లో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి జాగరణ నిర్వహించారు.ప్రజలు, శివభక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలు, జాగరణలతో వేడుకగా జరుపుకున్నారు. మహాదేవుడికి మహాన్యాస రుద్రాభిషేకాలు, అర్చనలు, పూజలు, శివపార్వతుల కల్యాణోత్సవాలను అంతటా ఘనంగా నిర్వహించారు.గుండ్లపాహాడ్ రాజరాజేశ్వర ఆలయంలో అర్చకుడు రాజకోటయ్య ప్రత్యేక పూజలు నిర్వహించగా వివిధ పార్టీలకు చెందిన నాయకులతో పాటు, అధికారులు, భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నల్లబెల్లి మండలం గుండ్లపహాడ్ గ్రామ శివాలయంలో నిర్వహించిన శివరాత్రి వేడుకల్లో నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా దేవాలయంలో అభిషేకం,అర్చనలు నిర్వహించి భక్తులతో కలిసి ప్రార్థనలు చేశారు.మహాశివరాత్రి పర్వదినం ఆధ్యాత్మికతకు ప్రతీక అని అన్నారు.నర్సంపేట నియోజకవర్గ ప్రజలందరూ శాంతి,సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.